
నల్లగొండ ప్రతినిధి, డిసెంబర్ 3(నమస్తే తెలంగాణ): ప్రపంచ దేశాలను వణికిస్తున్న ఒమిక్రాన్.. భారత్‌లోనూ ప్రవేశించిందన్న వార్తల నేపథ్యంలో మరోమారు కొవిడ్ టీకాలపై చర్చ మొదలైంది. నూరు శాతం వ్యాక్సినేషన్ లక్ష్యంగా ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తున్నా, కొందరి నిర్లక్ష్యం అందరిలోనూ ఆందోళనకు గురిచేస్తున్నది. తొలి డోస్ 90 శాతం దాటినా, రెండో డోస్‌ను జనం లైట్ తీసుకుంటుండడం విచారకరం. గడిచిన నాలుగు నెలల్లో కొవిడ్ సాధారణ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఇంకేం కాదులే అనే నిర్లక్ష్య ధోరణితో ఎక్కువమంది ఉంటున్నట్లు వైద్యారోగ్య శాఖ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లావ్యాప్తంగా శుక్రవారం నాటికి 85,675 మంది రెండో డోస్ తీసుకోవాల్సిన ఉన్నా ఖాతరు చేయకపోవడం గమనార్హం. సెల్ఫోన్లకు మెసేజ్ వెళ్లినా పట్టించుకోవడం లేదని వైద్య సిబ్బంది చెప్తున్నారు. ఒమిక్రాన్ నేపథ్యంలో ఇప్పటికైనా కండ్లు తెరువాలని వైద్యారోగ్య శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. రెండు డోసులు తీసుకుంటేనే సేఫ్ అని అనేక పరిశోధనల్లోనూ నిరూపితమైందని గుర్తు చేస్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా మాస్ వ్యాక్సినేషన్ కొనసాగుతున్నది. సెప్టెంబర్ 16 నుంచి పీహెచ్‌సీల వారీగా ప్రత్యేక బృందాలు ఇంటింటికీ వ్యాక్సిన్ అందిస్తున్నాయి. తొలి డోసు 90శాతానికి మించగా రెండో డోసునూ నూరు శాతం పూర్తి చేసేలా కొనసాగుతున్నది.
ఉమ్మడి జిల్లాలో 85,675 మంది…
ఉమ్మడి జిల్లాలో గడువు ప్రకారం రెండో డోసు వ్యాక్సిన్ తీసుకోని వారు 85,675 మంది ఉన్నట్లు వైద్యారోగ్య శాఖ గణాంకాలు చెప్తున్నాయి. రెండు టీకాల మధ్య 84రోజుల గడువు ముగుస్తున్నా ముందుకు రావడం లేదు. వీరిలో సూర్యాపేట జిల్లా నుంచే ఎక్కువగా ఉన్నారు. సూర్యాపేట జనరల్ దవాఖానతో పాటు 28 పీహెచ్‌సీల పరిధిలో వ్యాక్సినేషన్ కొనసాగుతున్నది. జిల్లా వ్యాప్తంగా నేటికీ 42,772 మంది రెండో డోసు టీకా వేయించుకోలేదు. ఇందులో కొవిషీల్డ్ 33,939 మంది, కొవాగ్జిన్ 8,833 మంది ఉన్నారు. అత్యధికంగా సూర్యాపేట జీజీహెచ్‌లో 5,215 మంది, ఆ తర్వాత వరుసలో రాజీవ్‌నగర్ పీహెచ్సీలో 4,543 మంది, లింగగిరి 3,607 మంది, మోతె పీహెచ్సీ పరిధిలో 3,385 మంది ఉన్నారు. జనాభా పరంగా పెద్దదైన నల్లగొండ జిల్లాలో కొంత మెరుగైన పరిస్థితి కనిపిస్తున్నా…. 25,347 మంది రెండో డోసుకు దూరంగా ఉన్నారు. ఇందులో 20,054 కొవిషీల్డ్, 5,293 మంది కొవాగ్జిన్ వేయించుకోవాల్సి ఉన్నది. యాదాద్రి భువనగిరి జిల్లాలో మొత్తం 17,556 మంది రెండో డోస్‌పై నిర్లక్ష్యంగా ఉన్నారు. ఇక్కడ 25 కేంద్రాల ద్వారా వ్యాక్సినేషన్ కొనసాగుతున్నది. 16,206 మంది కొవిషీల్డ్, 1,350 మంది కొవాగ్జిన్ రెండో డోసు వేసుకోవాల్సి ఉన్నది. మునిపంపులలో ఇద్దరు, శారాజీపేటలో ఆరుగురు, ఆలేరు పీహెచ్సీలో 53 మంది పెండింగ్‌లో ఉండడం గమనార్హం.
అత్యధికంగా బీబీనగర్‌లో 2,855 మంది, ఎయిమ్స్‌లో 2,032 మంది, నారాయణపురంలో 1,416మంది, గుండాల పీహెచ్సీ పరిధిలో 1,169 మంది, భువనగిరి దవాఖాన పరిధిలో 1,147 మంది రెండో డోసు వేసుకోవాల్సి ఉన్నదని వైద్యారోగ్య శాఖ లెక్కలు స్పష్టం చేస్తున్నాయి.
కఠిన నిర్ణయాలు తప్పవా!
ఒమిక్రాన్ వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రజలు కూడా అప్రమత్తంగా వ్యవహరించాలని వైద్యారోగ్య శాఖ ఇప్పటికే స్పష్టం చేసింది. కొన్నాళ్లుగా నిర్లక్ష్యంగా ఉంటున్న ప్రజలు మళ్లీ తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందేనని సూచించింది. నిబంధనలు పాటిస్తేనే ముప్పు తగ్గుతుందని, మాస్కులు ధరించాలని, భౌతికదూరం పాటించాలని ఆదేశాలు జారీ చేసింది. ఇదే సమయంలో వ్యాక్సినేషన్‌కు అత్యధిక ప్రాధాన్యమివ్వాలని కూడా నిర్ణయించింది. డిసెంబర్ నెలాఖరుకల్లా నూరుశాతం పూర్తి చేసేందుకు కార్యాచరణను ప్రకటించింది. ఈ నేపథ్యంలో శుక్రవారం జిల్లాల వారీగా వైద్యారోగ్య శాఖ సమీక్ష చేపట్టింది. వ్యాక్సిన్లు ప్రాణాలను రక్షిస్తాయని నిరూపితమైన నేపథ్యంలో 18ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేసుకోవాలని విస్తృత ప్రచారం కల్పించాలని నిర్ణయించారు. ఈ నెలాఖరులోగా అందరికీ వ్యాక్సిన్ వేసేలా ఆవాసం యూనిట్‌గా తీసుకోనున్నారు. మున్ముందు బహిరంగ ప్రదేశాల్లో, పని ప్రదేశాల్లో, ప్రయాణాల్లో కొవిడ్ వ్యాక్సిన్ సర్టిఫికెట్ తప్పనిసరి చేయనున్నారు. ఇదే సమయంలో మాస్క్ ధరించని వారికి వెయ్యి రూపాయల జరిమానా నిబంధనను శుక్రవారం నుంచే కఠినంగా అమలు చేస్తున్నారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తే మూడో వేవ్ ముప్పు నుంచి బయటపడవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.
బాధ్యత మరిస్తే ఎలా..?
బాధ్యతగా ఉండాల్సిన పోలీసు సిబ్బంది నిర్లక్ష్యంగా ఉంటే ఎలా..? శుక్రవారం నల్లగొండ జిల్లా కేంద్రంలో ఓ పోలీస్ మాస్కు, హెల్మెట్ లేకుండా ద్విచక్రవాహనంపై వెళ్తున్న
దృశ్యమిది.