
సరిగ్గా.. వారం రోజుల్లో జరుగనున్న శాసన మండలి స్థానిక సంస్థల నియోజకవర్గ ఎన్నికలపై టీఆర్ఎస్ పూర్తిస్థాయిలో దృష్టి సారించింది. అత్యధిక ఓట్లను సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నది. టీఆర్ఎస్తోపాటు ఇతర పార్టీల ఓటర్లు సైతం కలిసొచ్చేలా వ్యూహరచన చేస్తున్నది. అందులో భాగంగా ముందుగా నియోజకవర్గాల వారీగా
ప్రత్యేకంగా సమావేశాలు ఏర్పాటు చేసింది. వాటిలో ఓటర్లతోపాటు ముఖ్య నేతలు పాల్గొంటుండగా, ఎన్నికల్లో వ్యవహరించాల్సిన తీరుపై జిల్లా మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి దిశానిర్ధేశం చేస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే నేతృత్వంలో జరుగుతున్న ప్రతి సమావేశంలోనూ అభ్యర్థి ఎంసీ కోటిరెడ్డితోపాటు మంత్రి స్వయంగా పాల్గొంటున్నారు. ఇదే సమయంలో నమూనా బ్యాలెట్‌ను చూపుతూ ఓటింగ్‌పైనా అవగాహన కల్పిస్తున్నారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యాన్ని గుర్తు చేస్తూ భారీ మెజార్టీ సాధించేలా సమాయత్తం చేస్తున్నారు.
నల్లగొండ ప్రతినిధి, డిసెంబర్ 3(నమస్తే తెలంగాణ) : ఉమ్మడి జిల్లాతో కూడిన స్థానిక సంస్థల శాసనమండలి నియోజకవర్గ ఎన్నికల్లో ప్రధాన అభ్యర్థిగా టీఆర్ఎస్ నుంచి మంకెన కోటిరెడ్డి, మరో ఆరుగురు స్వతంత్ర అభ్యర్థులు రంగంలో నిలిచారు. బలాబలాలను పరిశీలిస్తే టీఆర్ఎస్ విజయం ఏకపక్షమేనన్నది స్పష్టం. మొత్తం 1,271 ఓట్లల్లో అత్యధికం టీఆర్ఎస్ చేతిలో ఉన్నాయి. అయినా సరే ఎన్నికలు ఏవైనా పకడ్బందీగానే వ్యవహరించాలన్న ఉద్దేశంతో జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డి నేతృత్వంలో ప్రత్యేక కార్యాచరణతో సన్నద్ధం అవుతున్నారు. ఆయా నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేల నేతృత్వంలో ఓటర్లతో ప్రత్యేక సమావేశాలకు శ్రీకారం చుట్టారు. ఈ నెల 1వ తేదీ దేవరకొండలో, శుక్రవారం ఉమ్మడి జిల్లా పరిధిలోని ఐదు నియోజకవర్గాల్లో సమావేశాలు నిర్వహించారు. మిగతా నియోజకవర్గాల్లోనూ నేడు, రేపు సమావేశాలు పూర్తి చేయనున్నారు. శుక్రవారం భువనగిరిలో జరిగిన సమావేశంలో భువనగిరితో పాటు ఆలేరు నియోజకవర్గాలకు చెందిన ఓటర్లు, ముఖ్య నేతలంతా హాజరయ్యారు. మంత్రి జగదీశ్‌రెడ్డితోపాటు ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా, జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్‌రెడ్డి, ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి, అభ్యర్థి ఎంసీ కోటిరెడ్డి పాల్గొని ఓటర్లకు దిశానిర్దేశం చేశారు. తర్వాత నకిరేకల్‌లో స్థానిక ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య నేతృత్వంలో జరిగిన సమావేశంలో మంత్రి జగదీశ్‌రెడ్డితోపాటు ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, జడ్పీ చైర్మన్లు బండా నరేందర్‌రెడ్డి, సందీప్‌రెడ్డి, ఎమ్మెల్యే సైదిరెడ్డి కూడా పాల్గొన్నారు. కోదాడలో బొల్లం మల్లయ్యయాదవ్ నేతృత్వంలోనూ, సాయంత్రం మంత్రి సొంత నియోజ కవర్గం సూర్యాపేటలోనూ స్థానిక ఓటర్లతో సమావేశాలు నిర్వహించారు. వీటన్నింటిలోనూ అభ్యర్థి కోటిరెడ్డితోపాటు మంత్రి జగదీశ్‌రెడ్డి పాల్గొని ఓటర్లకు ఎన్నికల ప్రాధాన్యతను వివరించారు. స్థానిక సంస్థలకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యత అదేవిధంగా ప్రజాప్రతినిధులకు గౌరవ వేతనం విషయంలో తీసుకున్న చర్యలను సైతం వివరించారు. గతంలో ఎన్నడూ లేనంతా పలుమార్లు గౌరవ వేతనాలను పెంచిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని స్పష్టం చేశారు. ఇటీవల కూడా 30శాతం వేతనాలు పెంచిన విషయాన్ని గుర్తు చేశారు. ఇదే సమయంలో స్థానిక సంస్థలను గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తే ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నదని వివరిస్తున్నారు. గతంలో బీఆర్జీఎఫ్ నిధులు వచ్చేవని, కానీ, బీజేపీ ప్రభుత్వం వాటిని రద్దు చేసిందని వెల్లడించారు. అదేవిధంగా గతంలో కేంద్ర ఫైనాన్స్ సంస్థ నిధులను స్థానిక సంస్థల్లో 50శాతం గ్రామ పంచాయతీలకు, మరో 30శాతం మండల, 20శాతం జిల్లా పరిషత్‌లకు వాటా ఉండేదని, బీజేపీ ప్రభుత్వం 100శాతం నిధులను గ్రామ పంచాయతీలకే ఇవ్వాలన్న నిబంధనలు తేవడంతో మండల, జిల్లా పరిషత్‌ల ఉనికి ప్రశ్నార్థకంగా మారిందని పేర్కొన్నారు. దీనిపై సీఎం కేసీఆర్ అభ్యంతరం తెలుపుతూ మండల, జిల్లా పరిషత్‌లకు 10శాతం చొప్పున కేటాయించేలా కృషి చేశారని తెలిపారు. ఉమ్మడి జిల్లా అభివృద్ధి టీఆర్ఎస్తోనే సాధ్యమైందని, ఇప్పటికే అమలవుతున్న అనేక పథకాలే అందుకు సాక్ష్యమని స్పష్టం చేస్తూ.. టీఆర్ఎస్ అభ్యర్థి ఎంసీ కోటిరెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలుపించుకుందామని పిలుపునిచ్చారు. పార్టీ ఓటర్లతో పాటు ఇతర పార్టీలకు చెందిన ఓటర్లను సైతం కలిసొచ్చేలా అందరూ కృషి చేయాలని సూచించారు. రాష్ట్రంలోనే అత్యధిక ఓట్లతో గెలుపొందిన స్థానంగా నల్లగొండను ముందుంచాలని విజ్ఞప్తి చేశారు.
బ్యాలెట్లో టీఆర్ఎస్ అభ్యర్థితే మొదటి స్థానం
ఈ ఎన్నికలు ప్రాధాన్యత ప్రకారం జరుగుతాయని, ఎన్నికల్లో ఓటు ఎలా వేయాలన్న దానిపైనా అవగాహన కల్పించారు. నమూనా బ్యాలెన్ చూపుతూ ఓటు వేసే విధానాన్ని వివరించారు. బ్యాలెట్లో టీఆర్ఎస్ అభ్యర్థిదే మొదటి స్థానమంటూ తొలి ప్రాధాన్యత ఓటును మాత్రమే అంకెల రూపంలో వేయాల్సి ఉంటుందని సూచించారు. ఓటర్లకు ఉన్న సందేహాలను కూడా నివృత్తి చేస్తూ పూర్తి స్థాయిలో వారిని సన్నద్ధం చేసేలా కార్యచరణను కొనసాగిస్తున్నారు. ఈ ఎన్నికల్లో అత్యధిక ఓట్లు సాధించడమే లక్ష్యంగా అందరూ పనిచేయాలని, ఉమ్మడి నల్లగొండ జిల్లాలో విజయపరంపరను కొనసాగించాలని సూచించారు. హుజూర్నగర్, సాగర్ ఉప ఎన్నికలు, పట్టభద్రుల ఎన్నికల్లోనూ సాధించిన విజయాల మాదిరిగానే ఇక్కడా మంచి విజయాన్ని పార్టీ అధినేత కేసీఆర్‌కు బహుమతిగా ఇద్దామన్న ధోరణితో ముందుకు సాగుతున్నారు.