
బాధ్యత మరిచి.. భరోసాను విడిచి.. రైతు జీవితంతో రాజకీయం చేస్తున్నది బీజేపీ. ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర ప్రభుత్వ పెద్దలు ఒక మాట.. ఆ పార్టీ రాష్ట్ర నేతలు మరొక బాటతో గందరగోళం సృష్టిస్తుండడంపై రైతాంగం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది. రైతు పక్షాన టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్లో మూడ్రోజుల నుంచి ఒంటరి పోరాటం చేస్తున్నా కాంగ్రెస్, బీజేపీ నేతలు కలిసి రాకపోవడంపై మండిపడుతున్నది. నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చిన బండి సంజయ్‌కు సరైన శాస్తి జరిగిందన్న చర్చ జోరుగా సాగుతున్నది. యాదాద్రి జిల్లా గుండాలలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్యాసుందర్ను రైతు యాదవరెడ్డి కల్లంలోనే కడిగిపారేయడమూ
యాదికొస్తున్నది. మరోవైపు పార్లమెంట్లో టీఆర్ఎస్ ఎంపీలు గురువారం కూడా ఆందోళన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం తీరును నిరసిస్తూ గాంధీ విగ్రహం వద్ద బైఠాయించారు. ధాన్యం కొనుగోళ్లపై స్పష్టమైన వైఖరి ప్రకటించే వరకు తమ ఆందోళన కొనసాగుతుందని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్ స్పష్టం చేశారు.
నల్లగొండ తిరగబడ్డా మారని సంజయ్ తీరు గుండాలలో రైతు నిలదీత కూడా చర్చలోకి..రైతు పక్షాన పార్లమెంట్లో టీఆర్ఎస్ ఒంటరి పోరురైతు సంఘాల నుంచి మద్దతు కలిసిరాని కాంగ్రెస్ తీరుపై మండిపాటు కేంద్రం స్పష్టమైన ప్రకటన ఇచ్చే వరకు పోరాటం ఆగదు : ఎంపీ బడుగుల
నల్లగొండ ప్రతినిధి, డిసెంబర్ 2(నమస్తే తెలంగాణ) :బీజేపీ నేతల తీరు ఉమ్మడి జిల్లా రైతాంగ ప్రయోజనాలకు తీవ్ర విఘాతంగా మారుతున్నది. రాజకీయ లబ్ధి కోసం రైతులను తప్పుదారి పట్టించేలా మాట్లాడుతుండడం పట్ల తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన అన్యాయాలను సరిచేస్తూ స్వరాష్ట్రంలో రైతు సగర్వంగా నిలబడే ప్రయత్నాలు జరుగుతుండగా కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు శరఘాతంగా మారుతున్నాయన్నది కాదనలేని నిజం. ధాన్యం కొనుగోళ్లపై కత్తి గట్టిన కేంద్రం కొనేది లేదంటూ మొండికేస్తుండడంతో ఉమ్మడి జిల్లా రైతాంగం తీవ్రంగా మండిపడుతున్నది. స్వరాష్ట్రంలో 24గంటల కరంటు, సాగు నీరు అందుతుంటే వరి సాగు వద్దంటే ఎలా? అని రైతులు ప్రశ్నిస్తున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై తిరుగుబాటకు కూడా ఇదే కారణమైంది. గత నెల 15, 16 తేదీల్లో నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో పర్యటనకు వస్తే రైతులు తిరగబడ్డారు. కేంద్రంతో ప్రకటన చేయించాక పర్యటన చేయాలంటూ ఎక్కడికక్కడ నల్లజెండాలు, చెప్పులతో నిరసనలు తెలిపిన విషయం తెలిసిందే. రైతుల ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక బండి సంజయ్ తోకముడిచాడన్న అభిప్రాయం సర్వత్రా నెలకొంది.
గోదావరి జలాల రాకతో సూర్యాపేట జిల్లాలో రైతులు ఇప్పుడిప్పుడే వరిసాగు చేస్తున్నారు. ఏండ్ల తరబడి ఎదురుచూసిన రైతులు… మూడేైండ్లెనా గడువక ముందే వరి సాగు వద్దంటే ఎలా అని రగిలిపోతున్నారు. భూములన్నీ వరిసాగుకు అనుకూలంగా మల్చుకున్నామని, ఇప్పుడు వద్దంటే ఏమై పోవాలని ప్రశ్నిస్తున్నారు.
ఈ నేపథ్యంలో బండి సంజయ్ రైతులకు సమాధానం చెప్పలేక పర్యటనను అర్ధాంతరంగా ముగించుకుని వెళ్లిపోక తప్పలేదు. ఇక యాదాద్రి జిల్లాలోని గుండాలలోనూ బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్యాంసుందర్‌తో పాటు మరికొందరికి ఇదే పరిస్థితి ఎదురైంది. కేంద్ర ప్రభుత్వం వడ్లు ఎందుకు కొనదు? కొనకుంటే మేము ఏటు పోవాలి.. ఏం కావాలి..? అంటూ ఓ రైతు వేసిన ప్రశ్నలకు బీజేపీ నాయకులు నీళ్లు నమిలారు. ఉమ్మడి జిల్లాలోని బీజేపీ నేతలెవ్వరూ కూడా రైతుల వద్దకు వెళ్లేందుకు సాహసం చేయడం లేదు. కేంద్ర ప్రభుత్వం ఓ రకంగా చెబుతుంటే రాష్ట్ర నేతలు మరో రకంగా వక్రీకరిస్తూ తప్పుదోవ పట్టిస్తుండడాన్ని జిల్లా రైతాంగం కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. మరోవైపు తాజాగా కేంద్ర ప్రభుత్వం టీఆర్ఎస్ ఆందోళనతో తొలిసారిగా పంటల వైవిధ్యం అవసరమేనంటూ ఒప్పుకోక తప్పలేదు. కానీ, ఆ బీజేపీ రాష్ట్ర నేతలు మాత్రం వరి పంటే వేయాలంటూ రైతులను రెచ్చగొడుతుండడం వారి వక్రబుద్దిని బయట పెడుతున్నది. వాస్తవాలను పక్కన పెట్టి కేవలం టీఆర్ఎస్ ప్రభుత్వంపై బురదజల్లడమే లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ నేతల తీరు మరోసారి స్పష్టమైంది.
టీఆర్ఎస్ ఎంపీల ఒంటరిపోరు…
యాసంగిలో ధాన్యం కొనుగోళ్లతో పాటు ఎంఎస్పీ చట్టబద్ధతను కొనసాగించాలని డిమాండ్ చేస్తూ పార్లమెంట్లో టీఆర్ఎస్ ఎంపీలు చేస్తున్న ఆందోలన నాలుగు రోజులకు చేరింది. యాసంగిలో తెలంగాణ ధాన్యం కొంటారా? లేదా? అన్న ఏకైక ప్రశ్నకు సమాధానం కావాలన్నదే ఎంపీల ప్రధాన డిమాండ్. ఎంపీల పోరాటంలో జిల్లాకు చెందిన రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్ చురుకైన పాత్ర పోషిస్తున్నారు. నిత్యం ప్లకార్డులు, రాష్ట్ర రైతుల డిమాండ్లతో నినాదాలు చేస్తూ కేంద్రాన్ని నిలదీస్తున్నారు. అయితే పార్లమెంట్ వేదికగా జరుగుతున్న ఆందోళనల్లో టీఆర్ఎస్ మాత్రమే రైతు పక్షంగా నిలుస్తుండగా జిల్లాకు చెందిన ఇద్దరు కాంగ్రెస్ ఎంపీలతో పాటు రాష్ర్టానికి చెందిన బీజేపీ ఎంపీలు ఎందుకు గొంతు కలుపడం లేదన్న చర్చ జరుగుతున్నది.
కేంద్రం పోరాటం ఆగదు : ఎంపీ బడుగుల
రాష్ట్ర రైతుల ప్రయోజనాల రక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చే వరకు పార్లమెంట్లో మా పోరాటం ఆగబోదని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్ స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన ‘నమస్తే తెలంగాణ’తో ఢిల్లీ నుంచి ప్రత్యేకంగా మాట్లాడుతూ కేంద్రం ప్రభుత్వం మొండివైఖరి విడనాడాలని, లేదంటే ఆందోళన మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. గురువారం పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద ప్లకార్డులతో ఆందోళన నిర్వహించామని చెప్పారు. యాసంగిలోనూ ధాన్యం కొనుగోళ్లకు ఒప్పుకోవాలని, ఎంఎస్పీకి చట్టబద్ధతను కొనసాగించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర రైతాంగం పట్ల చిత్తశుద్ధి ఉంటే కేంద్ర ప్రభుత్వంపై పోరాటంలో రాష్ర్టానికి చెందిన కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు కూడా తమతో కలిసిరావాలని సవాలు విసిరారు. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం పాకులాడవద్దని, ఇలాంటి ధోరణి రైతులకు చేస్తున్న ద్రోహమేనని వ్యాఖ్యానించారు.
బీజేపోళ్లు బెల్లం కొట్టిన రాయిలా ఉంటే ఎట్లా..
ఒకవైపేమో కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కారోళ్లు వడ్ల కొనుగోలుపై నోరుమెదుపుతలేరు.. ఇక్కడేమో రాష్ట్ర బీజేపోళ్లు రైతులను తప్పుదోవ పట్టించేందుకు కల్లాల చుట్టూ తిరుగుతూ యాసంగిలో వరి వేసుకొమ్మని చెప్తున్నరు. ఇక్కడ తిరిగేకంటే వాళ్ల సర్కారోళ్లను అడిగి వడ్లను కొనుగోలు చేసేలా చూడాలే. రైతుల కోసం టీఆర్ఎస్ పార్టీ ఎంపీలు ఢిల్లీలో గళమెత్తుతుంటే.. బీజేపోళ్లకు కండ్లు కనపడటం లేదా. రాష్ట్ర రైతుల తరఫున వీళ్లు పోరాడరా..? బెల్లం కొట్టిన రాయిలా ఉంటే ఎట్లా..? మూడు రోజులుగా ఢిల్లీలో టీఆరెస్సోళ్లు పోరాటం చేస్తుండ్రు. బీజేపీ ఎంపీలు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లుగా ఉంటుర్రు. రైతులను అరిగోస పెట్టిస్తున్నరు. బీజేపోళ్లు సిగ్గుతెచ్చుకోవాలె.
-బీట్ల లక్ష్మీనరసింహారెడ్డి, రైతు, వీరారెడ్డిపల్లి, తుర్కపల్లి
టీఆర్ఎస్ ఎంపీలకు కృతజ్ఞతలు..
రైతుల పక్షాన పార్లమెంటులో అలుపెరుగని పోరాటం చేస్తున్న టీఆర్ఎస్ ఎంపీలకు కృతజ్ఞతలు. ధాన్యం కొనుగోలు చేయాలని మూడు రోజులుగా ఆందోళన చేస్తున్నా కేంద్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం సరికాదు. బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలు రాష్ట్రంలో ఒకలా, ఢిల్లీలో మరోలా వ్యవహరిస్తూ రైతులను మోసం చేస్తున్నరు. కేంద్రప్రభుత్వం తెలంగాణ రైతుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి.
-కొయ్యడ శేఖర్‌గౌడ్, రైతు, తంగడపల్లి(చౌటుప్పల్)
కాంగ్రెస్, బీజేపీ నాయకులు చరిత్ర హీనులుగా మిగిలిపోతారు..
ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం చాలా బాధాకరంగా ఉంది. రెండు రోజులుగా టీఆర్ఎస్ పార్టీ ఎంపీలు పార్లమెంటులో చేస్తున్న ధర్నాను చూసైనా కేంద్రానికి రాష్ట్రంలో ఉన్న రైతులపట్ల సానుభూతి కలుగుతుందని ఆశిస్తున్నాం. దీనికి తోడు కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా టీఆర్ఎస్ ఎంపీలకు ఎటువంటి సహకారం లభించకపోవడం శోచనీయం. ఇప్పటికైనా బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నాయకులు రాష్ట్రంలో ఉన్న రైతుల పక్షాన నిలబడకపోతే చరిత్ర హీనులుగా మిగిలిపోతారు.
ధాన్యం కొనుగోలుపై కేంద్రం స్పష్టత ఇవ్వాలి…
యాసంగిలో ధాన్యం కొంటామని కేంద్రం స్పష్టమైన హామీ ఇవ్వాలి. రైతుల కోసం టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంటులో ఒంటరి పోరాటం చేస్తున్నా.. కనీసం స్పందించని బీజేపీ, కాంగ్రెస్ నాయకులు దండుగ. వానకాలం ధాన్యం రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేసింది. యాసంగిలో కూడా ధాన్యం కొనుగోలు చేసి కేంద్రం సహకరించాలి. రైతులతో చెలగాటం బీజేపీ ఉనికికే ప్రమాదం
-తెల్ల శంకర్, రైతు, చిన్నసూరారం(నల్లగొండ రూరల్)