యాసంగి సీజన్లో వరికి ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని రైతులను వ్యవసాయ శాఖ ప్రోత్సహిస్తున్నది. కేంద్రం ధాన్యం కొనుగోలు చేయడం లేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఇతర పంటల సాగుపై దృష్టి సారించాలని సూచిస్తున్నది. దీంతో రైతులు మినుములు, ఆముదం, శనగలు, నువ్వులు, మొక్కజొన్న వంటి పంటలపై ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో గ్రామస్థాయిలో 20 నుంచి 30 శాతం వరకు వరి తగ్గే అవకాశం ఉన్నది. కందనూలు జిల్లాలో పంటల ప్రణాళిక ఖరారు అయ్యింది. 1.65 లక్షల ఎకరాల్లో వేరుశనగ, 1.10 లక్షల ఎకరాల్లో వరి సాగు కానున్నట్లు అంచనా వేశారు. ఇందుకు సరిపడా ఎరువులూ సిద్ధం చేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు.
నాగర్‌కర్నూల్, అక్టోబర్ 30 (నమస్తే తెలంగాణ) : యాసంగి సాగు ప్రణాళిక పూర్తయింది. ధాన్యం కొనుగోళ్లను యాసంగి నుంచి నిలిపివేస్తున్నట్లు కేంద్రం స్పష్టం చేసింది. దీంతో ఈ సీజన్లో వరి సాగు తగ్గించేలా ప్రభుత్వం అవగాహన కల్పిస్తున్నది. వ్యవసాయ శాఖ క్లస్టర్ల పరిధిలోని రైతులకు పప్పు, నూనె గింజల పంట సాగుతో కలిగే లాభాలను వివరిస్తున్నది. ఈ క్రమంలో రైతులు వరికి ప్రత్యామ్నాయ సాగుపై కాస్త ఆసక్తి కనబరుస్తున్నారు. 20 నుంచి 30 శాతం వరకు వరి సాగు తగ్గడం గమనార్హం. నాగర్‌కర్నూల్ జిల్లాలో గత 2020-2021 యాసంగి సీజన్లో 1,47,829 ఎకరాల్లో వరి సాగవగా.. ఈ సీజన్లో 1,10,000 ఎకరాల్లో సాగు చేయనున్నట్లు అధికారుల అంచనా. దాదాపుగా 37 వేల ఎకరాలు తగ్గననున్నది. గత సీజన్లో 3 లక్షల ఎకరాల్లో సాగు చేసిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేయగా.. ప్రస్తుతం జిల్లాలోనే 2 లక్షల ఎకరాల పంట ఉన్నది. దీంతో ఈ వానకాలం సీజన్లో కొనుగోలు చేసే ధాన్యం తరలించడం అధికారులకు కత్తిమీద సాములా మారింది. అయితే, సీఎం కేసీఆర్ రైతులపై ఉన్న ప్రేమతో వరికి మద్దతు ధర కల్పిస్తూ జిల్లాలో 230 వరకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ధాన్యం సేకరించేందుకు ఏర్పాట్లు చేపట్టారు. ఇలాంటి పరిస్థితుల్లో వ్యవసాయ శాఖ కల్పించిన అవగాహనతో రైతులు పప్పు, నూనె గింజల సాగుపై ఆసక్తి చూపనున్నారు. మార్కెట్లో ఈ పంటలకు అధికంగా మద్దతు ధర, డిమాండ్ ఉన్నది. అలాగే స్వల్ప కాలంలో దిగుబడి కూడా వస్తుంది. ఆముదం పెసర్లు, నువ్వులు, శనగలు, మొక్కజొన్న, జొన్న వంటి పంటలు పండించేందుకు రైతులు సన్నద్ధం కానున్నారు. జిల్లాలో గత సీజన్లో 3,06,897 ఎకరాల్లో వివిధ పంటల సాగు అంచనా ఉండగా.. ఈ ఏడాది 3,09,500 ఎకరాల్లో పంటలు సాగు కానున్నాయి. ఇందులో అత్యధికంగా 1,65,933 ఎకరాల్లో వేరుశనగ సాగు కానున్నట్లు అంచనా. గతేడాది 1,35,922 ఎకరాలుండగా.. ప్రస్తుతం 30 వేల ఎకరాలు పెరిగింది. గత సీజన్లో మినుములు 10,510 ఎకరాల్లో సాగు కాగా, ఈసారి 16,330 ఎకరాల్లో చేపట్టనున్నారు. మొక్కజొన్న 9,575, పెసర్లు 2,758, జొన్నలు 1,415, ఆముదం 1,226, శనగలు 302, నువ్వులు 293 ఎకరాల్లో సాగు కానున్నట్లు అధికారులు తెలిపారు. ఎరువుల అంచనాలు కూడా సిద్ధమయ్యాయి. యూరియా 22,025 మెట్రిక్ టన్నులు, డీఏపీ 6,702, పొటాషియం 3,704, కాంప్లెక్స్ 17,666, సూపర్ 846 మెట్రిక్ టన్నులుగా వ్యవసాయ శాఖ అంచనా రూపొందించింది. గత సీజన్కంటే 9 వేల మెట్రిక్ టన్నులు పెరగడం గమనార్హం. ఇలా యాసంగి సీజన్‌కు వ్యవసాయ శాఖ అంచనాలు రూపొందించింది.
యాసంగి ప్రణాళిక ఖరారు..
నాగర్‌కర్నూల్ జిల్లాలో యాసంగి పంట ప్రణాళికను ఖరారు చేశాం. మార్కెటింగ్‌ను బట్టి రైతులకు కల్పించిన అవగాహనతో 30 వేల ఎకరాల వరకు వరి పంట తగ్గే అవకాశం ఉన్నది. ఈ సీజన్లో అత్యధికంగా 1.65 లక్షల ఎకరాల్లో వేరుశనగ సాగు కానుండగా.. వరి 1.10 లక్షల ఎకరాల్లో సాగయ్యే అవకాశం ఉన్నది. వరికి బదులుగా రైతులు మినుములు, మొక్కజన్న, జొన్న వంటి పంటలపై మొగ్గు చూపనున్నారు. 50 వేల మెట్రిక్ టన్నుల ఎరువు అంచనా రూపొందించాం.