నాగర్కర్నూల్, నవంబర్ 11 (నమస్తే తెలంగాణ): తక్కువ సమయంలో ఎక్కువ లాభాలకు చిరునామా ఆరుతడి పంటలు. ప్రస్తుతం పెరిగిన పెట్టుబడులు, ఇతర ఖర్చులతో వరికి ప్రత్యామ్నాయంగా ఈ పంటలను సాగు చేయడం మేలు. మార్కెట్కు అనుగుణంగా సాగు చేయడంతో రైతులు లాభాలు ఆర్జించే అవకాశం ఉంది. కేంద్రం వరి ధాన్యం కొనుగోలు చేయలేమని పేర్కొంటుండటంతో రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఈ యాసంగిలో ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలని సూచిస్తోంది. ఈక్రమంలో శాస్త్రవేత్తలు, వ్యవసాయ శాఖ అధికారులు యాసంగిలో ఆరుతడి పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. దీనివల్ల 20నుంచి 30శాతం వరకు వరిసాగు తగ్గించేందుకు రైతులు ఆసక్తి చూపిస్తుండటం విశేషం.
ఆరుతడి పంటలతో అధిక మేలు..
మార్కెట్లో ఉన్న పరిస్థితులపై రైతులకు కల్పించిన అవగాహనతో గ్రామాల్లో వేరుశనగ, ఆముదం, పెసర, మినుములు, శనగ, మొక్కజొన్న, ఆవాలు, పొద్దుతిరుగుడు, కుసుమలు, ఉలవలు, జొన్న, నువ్వుల్లాంటి పంటల సాగుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ పంటలు 100నుంచి 150రోజుల్లోనే చేతికి వచ్చే అవకాశం ఉంది. ఎరువులు, నీటి వినియోగం తగ్గుతుంది. ముఖ్యంగా ఈ పంటలతో నేల భూసారం పెరుగుతుంది. ఈ పంటలను అంతర, మిశ్రమ పంటలుగానూ సాగు చేసుకోవచ్చు. మార్కెట్లో ఈ పంటలకు అధిగ డిమాండ్ ఉంది. అదే వరి పంట అయితే 3నుంచి 4నెలల కాలం పడుతుంది. సాగు యాజమాన్యం కూడా ఖర్చు, కష్టాలతో కూడుకున్నది. ఒక్క వరి పండించే నీటితో నాలుగైదు రకాల స్వల్ప కాలిక ఆరుతడి పంటలు పండించుకోవచ్చు. ఈ పంటలను మార్కెట్కు అనుగుణంగా ఎక్కడైనా అమ్ముకోవచ్చు. ఈ పంటల వల్ల భూసారం పెరుగుతుంది.
పంటల సాగు ఇలా..
వేరుశనగ
నీటి సౌకర్యం కలిగిన ఎర్ర నేలల్లో సెప్టెంబర్ నుంచి నవంబర్ రెండో వారం వరకు విత్తనాలు వేసుకోవచ్చు. కదిరి6-9, టీఏజీ-24, కదిరి 1818(లేపాక్షి) విత్తనాలు ఎకరాకు 60నుంచి 80కిలోలు అవసరమవుతాయి. ఈ పంట 100నుంచి 105రోజుల్లో కోతకు వస్తుంది. ఎకరాకు 10నుంచి 14క్వింటాళ్ల దిగబడి వస్తుంది. ఈ పంటకు ఎకరాకు రూ.12వేల వరకు ఖర్చు వస్తుంది. ప్రభుత్వం రూ.5,230మద్దతు ధర కల్పించింది.
పెసర
నీటి సౌకర్యంతో ఎర్ర, నల్లరేగడి నేలల్లో వరి మాగాణుల్లో నవంబర్ నుంచి డిసెంబర్ వరకు విత్తనాలు వేసుకోవచ్చు. ఎకరాకు డబ్ల్యూజి.జి.-42,37ఎం.జి.జి. 295, 347, 752, 787, పి.యు 31రకాల 6కిలోల విత్తనాలు వేసుకోవచ్చు. ఇక ఈ పంట అతి స్వల్ప కాలిక పంటగా చెప్పవచ్చు. ఎకరాకు కేవలం రూ.10వేల పెట్టుబడులు ఉన్న ఈ పంట 60నుంచి 70రోజుల్లోనే చేతికి వస్తుంది. ఇక దిగుబడి మాత్రం 5నుంచి 6క్వింటాళ్లు వస్తుంది. ప్రభుత్వం రూ.7,275చొప్పున మద్దతు ధర కల్పించింది.
శనగ
వర్షాధార నల్ల రేగడి, తేమ పట్టి ఉంచే నేలల్లో ఈ పంట సాగు చేయవచ్చు. నవంబర్ మొదటి, రెండో వారంలోపు విత్తనాలు వేసుకోవాల్సి ఉంటుంది. దేశవాళీ విత్తనాలైతే ఎకరాకు 25నుంచి 30కిలోలు, ఇందులో జె.జి. 11,130, జే.ఏ.కె.ఐ. 9218, ఐ.సి.సి.ఐ 37, నంద్యాల శనగ 1.47 విత్తనాలు ఉన్నాయి. ఇక కాబూళీ రకాలైన కె.ఎ.కె.-2, పూలే జి.95311 మరియు ఐ.సి.సి.వి.-2రకాల విత్తనాలు 45నుంచి 60కిలోలు అవసరమవుతాయి. ఈ పంట 90-110రోజుల్లో చేతికి వస్తుంది. ఎకరాకు రూ.10వేల పెట్టుబడులు అవసరమవుతాయి. దీనివల్ల 8-1క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. మార్కెట్లో రూ.5,230గిట్టుబాటు ధర కల్పించబడింది.
మొక్కజొన్న
ఎర్ర రేగడి, నల్లరేగడి నేలల్లోనూ పండుతుంది. హైబ్రిడ్, ప్రైవేట్ కంపెనీలకు చెందిన పలు రకాల విత్తనాలను నవంబర్ నుంచి డిసెంబర్ వరకు విత్తుకోవచ్చు. ఇవి ఎకరాకు కిలో అవసరమవుతాయి. ఈ పంటకు ప్రభుత్వం క్వింటాకు రూ.1,870చొప్పున మద్దతు ధర కల్పిస్తున్నది. ఇక జొన్న పంటను డిసెంబర్ వరకూ విత్తుకోవచ్చు. నల్ల, ఎర్ర, ఇసుక, దుబ్బ నేలల్లోనూ ఈ పంటను సాగు చేయవచ్చు. ప్రభుత్వం ఈ పంటకు రూ.2,758మద్దతు ధర కల్పించింది.
ఆవాలు
నల్లరేగడి నేలల్లో ఈ పంట పండుతుంది. పూస అగ్రాని, పూస మహాక్, వరుణ, నరేంద్ర, అగేతితో పాటు ఇతర ప్రైవేట్ కంపెనీలకు చెందిన విత్తనాలు మార్కెట్లో ఉన్నాయి. నవంబర్ రెండో వారం వరకు విత్తనాలు వేసుకోవచ్చు. ఎకరాకు 2నుంచి 2.50కిలోల విత్తనాలు అవసరమవుతాయి. ఈ పంట 120-125రోజుల్లో చేతికి వస్తుంది. ఎకరాకు 6-8క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. మార్కెట్లో ఈ పంటకు రూ.5,050 మద్దతు ధర ఉంది.
పొద్దుతిరుగుడు
ఎర్ర, నల్లరేగడి నేలల్లోనూ ఈ పంట మంచి దిగుబడి వస్తుంది. నవంబర్ నుంచి డిసెంబర్ వరకు విత్తనాలు వేసుకోవచ్చు. ఎకరాకు 2.50కిలోల నుంచి 30కిలోల విత్తనాలు కావాల్సి ఉంటుంది. దీనికిగానూ కే.బి.ఎస్.హెచ్ 44, ఎన్.డి.ఎస్.హెచ్-1, డీఆర్ఎస్హెచ్-1రకాల విత్తనాలు మంచిగా ఉంటాయి. ఈ పంట కేవలం 9నుంచి 95రోజుల్లోనే చేతికి వస్తుంది. ఎకరాకు రూ.10వేల పెట్టుబడి పెడితే 6-7క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. ప్రభుత్వం రూ.6,015చొప్పున మద్దతు ధర కల్పించింది. యాసంగి, వేసవి సీజన్లలో కొద్దిపాటి నీళ్లతోనే ఈ పంట పండుతుంది.
నువ్వులు
వచ్చే సంవత్సరంలో జనవరి 15నుంచి ఫిబ్రవరి 15వ తేదీ వరకు ఈ పంట సాగుకు విత్తనాలు వేసుకోవాల్సి ఉంటుంది. శ్వేత తిల్ రకాల విత్తనాలు ఎకరాకు 2నుంచి 2.25కిలోలు అవసరమవుతాయి. ఇది 90రోజుల్లోనే కోతకు వస్తుంది. యాసంగిలో అధిక దిగుబడి వస్తుంది. ఈ పంటకు ఏకంగా క్వింటాలుకు రూ.7,303మద్దు ధర ఉంది.
కుసుమలు
శీతాకాలంలో అనువైన ఈ పంటను ఈనెల మొదటి వారం వరకు విత్తుకోవాల్సి ఉంటుంది. మంజీరా టీ.ఎస్.ఎఫ్-1, నారి-6, పి.బి.ఎన్.ఎస్. -12, జె.ఎస్.ఎఫ్ 414, డి.ఎస్.హెచ్.-185 రకాల విత్తనాలను ఎకరాకు 4కిలో వరకు విత్తనాలు అవసరమవుతాయి. ఈ పంట 125-130 రోజుల్లో కోతకు వస్తుంది. ఎకరాకు రూ.10వేల పెట్టుబడులు మాత్రమే ఉంటాయి. ఇక దిగుబడి 4నుంచి 8క్వింటాళ్లవరకు వస్తుంది. ప్రభుత్వం క్వింటాకు రూ.5,441మద్దతు ధర కల్పించింది.
కంది
ఈ పంటకు నల్లరేగడి, ఎర్ర చెల్క నేలలు అనుకూలం. ఈ పంట 120-130రోజుల్లో కోతకు వస్తుంది. ఎకరాకు రూ.15వేల పెట్టుబడి పెడితే రూ.7నుంచి 8క్వింటాళ్లు వస్తుంది. ప్రభుత్వం ఈ పంటకు రూ.6,300చొప్పున మద్దతు ధర ప్రకటించింది.
డిమాండ్ ఉన్న పంటలే వేయాలి
మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలను సాగు చేస్తే అధిక లాభాలు వస్తాయి. వరి పంటతో పండించే నీటితో నాలుగైదు రకాల ఆరుతడి పంటలు సాగు చేయవచ్చు. ఎప్పుడూ ఒకే పంట వేస్తే భూసారం దెబ్బతింటుంది. దీనికి పంట మార్పిడే ముఖ్యం. చౌడు నేలలు మినహా మిగిలిన భూముల్లో వాణిజ్య పంటల సాగుతో ప్రయోజనం కలుగుతుంది. పెట్టుబడులు తగ్గుతాయి. ఇక మద్దతు ధర కూడా అధికంగానే ఉంటుంది.