హైదరాబాద్, జనవరి 27 : 2022-23 సంవత్సరానికిగాను నాబార్డ్ రుణ ప్రణాళికను ప్రకటించింది. గురువారం మంత్రుల నివాసంలో వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి ఈ ప్రణాళికను విడుదల చేశారు. మొత్తం రూ.1.66 లక్షల కోట్లతో ప్రణాళిక రూపొందించింది. ఇందులో వ్యవసాయ రంగానికి రూ.1.01 లక్షల కోట్లు కేటాయించిం ది. గతేడాది రూ.83,368.05 కోట్లు ప్రకటించగా.. ఈ ఏడాది రూ. 17,805 కోట్లు పెంచింది. గతేడాది మొత్తం రూ.1.35 లక్షలతో రుణ ప్రణాళికను విడుదల చేయగా.. ఈ ఏడాది రూ.3,0604.57 కోట్లు (15%) అధికంగా ప్రకటించింది. వ్యవసాయ రుణాల కోసం రూ.85,382.70 కోట్లు కేటాయించగా, మౌలిక వసతుల కల్పనకు రూ. 4,025.35 కోట్లు కేటాయించింది. ఎంఎస్ఎంఈల కోసం రూ.49,874.32 కోట్లు కేటాయించింది.
రుణపరిమితి పెంచాలి: మంత్రి నిరంజన్‌రెడ్డి
వ్యవసాయరంగానికి రుణపరిమితి పెంచాలని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. ఆయిల్‌పాం సాగును ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నదని, ఇందుకు నాబార్డు, బ్యాంకర్లు సహకరించాలని కోరారు. రైతుల ఆదాయాన్ని పెంచేందుకు ఆహారశుద్ధి సంస్థలను నెలకొల్పేందుకు ప్రత్యేక జోన్లు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ఆహారశుద్ధి పరిశ్రమలు, గోదాముల ఏర్పాటుకు సహకరించాలని మంత్రి కోరారు. నాబార్డ్ సహకారంతో కాళేశ్వరం, మిషన్ భగీరథ పథకాన్ని చేపట్టినట్టు తెలిపారు. కార్యక్రమంలో మంత్రు లు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సీఎస్ సోమేశ్‌కుమార్, ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్‌రావు, టెస్కాబ్ చైర్మన్ రవీందర్రావు, ఆర్బీఐ రీజనల్ డైరెక్టర్ నిఖిల, నాబార్డ్ సీజీఎం వైకే రావు తదితరులు పాల్గొన్నారు.