రాజౌరీ: జమ్మూకశ్మీర్లోని రాజౌరీ జిల్లా బుదాల్ గ్రామంలో అనుమానాస్పద మరణాలు అధికారులు, పౌరులను తీవ్రంగా కలవరానికి గురి చేస్తున్నాయి. అంతుచిక్కని వ్యాధి లేదా వైరస్ కారణంగా నెలన్నర వ్యవధిలో మూడు కుటుంబాలకు చెందిన 17 మంది మరణించారు. వీరి మరణాలు ఎలా సంభవించాయో తెలీక అధికారులు ఆందోళన చెందుతున్నారు.
మృతులలో ఆరుగురు చిన్నారులు కూడా ఉన్నారు. తాజాగా మరో వ్యక్తి దవాఖానలో చికిత్స పొందుతుండగా, ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. గ్రామాన్ని మూడు కంటైన్మెంట్ జోన్లుగా అధికారులు విభజించారు. గ్రామంలో ఇన్ఫెక్షన్ మరింత వ్యాప్తి చెందకుండా ప్రభుత్వ, ప్రైవేట్ కార్యకలాపాలు, సభలు, సమావేశాలపై నిషేధం విధించారు.