Mynampally Rohith | రామాయంపేట, నవంబర్ 2: మెదక్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి మైనంపల్లి రోహిత్ గూండాగిరి చేశారు. తనపై వ్యతిరేక వార్తలు రాస్తున్నాడంటూ ఓ జర్నలిస్టులపై దురుసుగా ప్రవర్తించారు. మెదక్ జిల్లా రామాయంపేట మండలం అక్కన్నపేటలో గురువారం మైనంపల్లి రోహిత్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఆ కార్యక్రమాన్ని కవర్ చేస్తున్న ఓ చానల్ రిపోర్టర్ ఫోన్ లాక్కొన్న మైనంపల్లి అనుచరులు.. డాటాను డిలీట్ చేశారు. 15 నిమిషాలపాటు జర్నలిస్టును నిర్బంధించారు. సమాచారం అందుకున్న మిగతా విలేకరులు అక్కడికి చేరుకోగానే, మైనంపల్లి రోహిత్ పలాయనం చిత్తగించారు. త
న ప్రచారంలో విలేకరులు ఎవరూ ఉండొద్దని, ఉంటే బాగుండదని మైనంపల్లి రోహిత్ హెచ్చరించడంపై జర్నలిస్టులు మండిపడ్డారు. దీంతో ప్రచారాన్ని మధ్యలోనే ముగించి రోహిత్ వేరే గ్రామానికి వెళ్లిపోయారు. రామాయంపేటలో మైనంపల్లి ఆగడాలు ఎక్కువయ్యాయని, బాధ్యతగల విలేకరులపైనే దాడులకు దిగడంపై మండిపడ్డారు. మైనంపల్లి రోహిత్ తక్షణమే బాధితుడికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇదే విషయమై రామాయంపేట పోలీస్ స్టేషన్లో వీడియో జర్నలిస్టుల సంఘం ఆధ్వర్యంలో ఫిర్యాదు చేశారు.