హనుమకొండ చౌరస్తా, ఆగస్టు 19 : దేశంలో 8 నెలల నుంచి మధ్యభారతంలో జరుగుతున్న మానవ హననాన్ని నిలిపివేసి వెంటనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం కాల్పుల విరమణను ప్రకటించాలని, ఇదివరకే కాల్పుల విరమణ ప్రకటించిన మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని తెలంగాణ పూర్వ విప్లవ విద్యార్థుల వేదిక కోకన్వీనర్ ఎంవీ రమణ డిమాండ్ చేశారు. మంగళవారం హనుమకొండ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పౌరసమాజం, రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు, మేధావులు ఉమ్మడిగా శాంతి చర్చలను కోరుతున్నాయన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దీనిపై ఆలోచన చేయాలన్నారు.
పీసా చట్టం, 1/70 యాక్ట్ భారత రాజ్యాంగంలోని 5వ, 6వ షెడ్యూలు అమలు చేయాలన్నారు. రాజ్యాంగంలోని 21వ ఆర్టికల్ ప్రకారం ఆదివాసులు జీవించే హక్కును కాపాడాలని వివిధ హక్కుల సంఘాలు, ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీలు ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నాయని పేర్కొన్నారు. వెంటనే కేంద్ర ప్రభుత్వం కాల్పుల విమరణ ఒప్పందం చేసుకొని శాంతి చర్చలు అమలు జరపాలని కోరారు. ఈ సమావేశంలో ప్రొఫెసర్ కూరపాటి వెంకటనారాయణ, భరద్వాజ్, డాక్టర్ ఎం.శంకర్‌నారాయణ, లాల్‌నీల్, డాక్టర్ ఎం.వెంగల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.