హైదరాబాద్, ఏప్రిల్ 16 (నమస్తే తెలంగాణ) : సర్కార్ తాజాగా విడుదల చేసిన కులగణన సర్వే లెక్కల్లో గందరగోళం నెలకొన్నది. ముఖ్యంగా ముస్లిం మైనారిటీలకు తీరని అన్యాయం జరిగిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. బీసీ ముస్లింల్లోని 14 వర్గాలకు చెందిన 64 ఉప కులాల జనాభా 35,76,588 (10.88%) మంది ఉన్నట్టు చూపించగా, ఓసీ ముస్లింల జనాభాను 8,80,424 (2.48%) మందిగా పేర్కొన్నారు. ఇది పూర్తిగా తప్పని మైనారిటీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. ఓసీ ము స్లింల్లో సయ్యద్, ముషైక్, మొఘల్, పఠాన్, ఇరానీ తదితర 16 ఉప కులాలు ఉన్నాయని చెప్తున్నారు. సబ్క్యాస్ట్ల వారీగా లెక్కించకుండా 2.48%గా చూపించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు.
కులగణన సర్వేలో బీసీ-ఈ క్యాటగిరీలో ఎండీ, అబ్దుల్లా ముస్లింలను ప్రత్యేకంగా చూపకపోవడంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. 2007లో బీసీ-ఈ క్యాటగిరీ ముస్లింలకు అప్పటి వైఎస్సార్ ప్రభుత్వం 4% రిజర్వేషన్లు కల్పించిందని చెప్తున్నారు. అయితే, రిజర్వేషన్‌కు సంబంధించిన ఉత్తర్వుల్లో ఎండీ అనే ఇంటి పేరు లేకపోవడంతో బీసీ-ఈ సర్టిఫికెట్లు జారీచేయలేదని గుర్తుచేస్తున్నారు.
సర్కార్ విడుదల చేసిన కులగణన సర్వేలో గందరగోళం నెలకొన్నదని మైనారిటీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎండీ యాకూబ్‌పాషా ఆరోపించారు. ముస్లింల జనాభాను తగ్గించి చూపారని, కొన్ని ఉప కులాలను సర్వే చేయకపోవడంతోనే ఈ పరిస్థితి ఎదురైందని అన్నారు.