శంషాబాద్ రూరల్, ఏప్రిల్ 16 ః కారులో మంటలు చెలరేగిన సంఘటన బుధవారం రాత్రి శంషాబాద్ పట్టణం సిద్దాంతి సమీపంలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం శంషాబాద్ పట్టణంలోని మెకానిక్ రవి కారు రిపేర్ పూర్తి చేసి ట్రయల్ చేస్తుండగా ఒక్కసారిగా కారు ముందుభాగంలో మంటలు రావడం చూసి కారును నిలిపి వెంటనే బయటకు వచ్చారు. అప్పటికే కారులో భారీగా మంటలు చెలరేగి కారు పూర్తిగా దగ్ధమైనట్లు చెప్పారు. నడిరోడ్డుపై సంఘటన చోటుచేసుకోవడంతో దాదాపు కిలోమీటర్ మేర ట్రాఫిక్ జామ్ అయింది. రంగంలోకి దిగిన పోలీసులు ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు.
ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. మరో సంఘటనలో హైదరాబాద్- బెంగుళూరు జాతీయ రహదారిలో షాద్‌నగర్ వైపు నుంచి శంషాబాద్ వైపు టీఎస్06సీ 1186 నంబర్‌గల కారు అతివేగంగా వచ్చి శంషాబాద్ మండలం పెద్దషాపూర్ చెక్‌పోస్ట్ సమీపంలోకి రాగానే ఆదుపుతప్పి డివైడర్‌ను ఢికొని ఇవతలివైపునకు వచ్చి బారీకేడ్లను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎవ్వరికి గాయాలు కాలేదు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా అవసరమైన చర్యలు తీసుకున్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.