హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 27 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ మహానగరాన్ని మూసీ ప్రవాహం ముంచెత్తింది. మునుపెన్నడూ లేనివిధంగా మూసీ నదికి ఆకస్మికంగా వరదలు రావడంతో పరీవాహక ప్రాంతాలు నీట మునిగాయి. జంట జలాశయాలైన ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ నుంచి శుక్రవారం సాయంత్రం రెండు టీఎంసీల కంటే ఎక్కువ నీటిని ఒకేసారి వదలడంతో వరద ప్రవాహం ఉగ్రరూపం దాల్చింది. దీంతో పరీవాహక ప్రాంతం అతలాకుతలమైంది. ప్రవాహ ఉద్ధృతికి చాదర్‌ఘాట్, పురానాపూల్, ఎంజీబీఎస్, ముసారంబాగ్ సహా మలక్‌పేట, మూసానగర్, శంకర్‌నగర్ బస్తీలు నీట మునిగాయి. పేదల ఇండ్లలోకి రాత్రి ఒక్కసారిగా వరద చేరడంతో కట్టుబట్టలతో ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బయటకు పరుగులు తీశారు.
ఇండ్లన్నీ వరదలో చిక్కుకుపోవడంతో సామగ్రి, నిత్యావసరాలు నీటి పాలయ్యాయి. చరిత్రలో మొదటిసారి మహాత్మాగాంధీ బస్‌స్టేషన్ (ఎంజీబీఎస్) జలదిగ్బంధంలో చిక్కుకుంది. దీంతో ఈ బస్‌స్టేషన్‌కు బస్సుల రాకపోకలను నిలిపివేశారు. రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నా వరద నీటి ప్రవాహాన్ని అంచనా వేయకుండా వరద మొత్తాన్ని ఒకేసారి విడుదల చేయడం వల్లనే మూసీలో వరద తీవ్రత పెరిగిందని పరీవాహక ప్రజలు ఆరోపిస్తున్నారు. భారీ వర్షంతో వరద ఉద్ధృతి పెరిగినా హైడ్రా, జీహెచ్ఎంసీ, రెవెన్యూ, జలమండలి, రెవెన్యూ అధికారులు ఎక్కడా కనిపించలేదని వాపోతున్నారు.
చాదర్‌ఘాట్, ముసారంబాగ్, మలక్‌పేట, శంకర్‌నగర్, మూసానగర్ బస్తీల్లోకి వరద నీరు ఒక్కసారిగా రావడంతో ప్రజలు భయాందోళనకు గురై కట్టుబట్టలతో బయటకు పరుగులు తీశారు. చెరువులను తలపిస్తున్న రోడ్లపైకి రావడానికి బస్తీవాసులు భయాందోళనకు గురయ్యారు. పలు బస్తీల్లో ఇండ్లపైకప్పు దాకా వరదనీరు చేరింది. ఎంజీబీఎస్ బస్టాండ్‌లో ఇర్కుకు న్న ప్రయాణికులు డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయంతో ప్రాణాల అరచేతిలో పెట్టుకుని బయటకు పరుగెత్తుకొచ్చారు. మెట్రో స్టేషన్లోకి కూడా వరద చేరింది.
రెండు రోజులుగా భారీ వర్షం కురుస్తున్నప్పటికీ అధికారులు మూసీ పరీవాహక ప్రజలను అప్రమత్తం చేయలేదు. హైడ్రా, రెవెన్యూ, జీహెచ్ఎంసీ, పోలీసు అధికారులు ఎలాంటి వరద హెచ్చరికలు జారీ చేయలేదు. జంట జలాశయాల గేట్లు ఎత్తినట్టు అధికారులు ముందుగా హెచ్చరించి ఉంటే తమ సామగ్రిని ఇండ్ల నుంచి తీసుకొచ్చేవారమని ముంపు బస్తీల ప్రజలు వాపోతున్నారు. వరద ఒక్కసారిగా ఇండ్లలోకి చేరడంతో దిక్కుతోచని పరిస్థితుల్లో కట్టుబట్టలతో బయటకు వచ్చామని కన్నీటి పర్యంతమవుతున్నారు. అధికారుల నామమాత్రపు చర్యల వల్ల లోతట్టు ప్రాంతాల ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఇండ్లు మునిగే వరద వచ్చినా అధికారుల్లో చలనం లేకపోవడం ఏమిటని నిలదీస్తున్నారు.
మూసీ ప్రవాహ ఉద్ధృతికి మూసారంబాగ్ బ్రిడ్జి పూర్తిగా మునిగి వరద నీరు పైనుంచి ప్రవహిస్తున్నది. నిర్మాణంలో ఉన్న హైలెవల్ బ్రిడ్జి సపోర్టింగ్ సెంట్రింగ్ ఐరన్ రాడ్లు వరద తాకిడికి కుంగిపోయాయి. దీంతో ఆ పరిసర ప్రాంతాల్లో ప్రయాణాలు, రాకపోకలు నిలిపేశారు. మరోవైపు జంట జలాశయాల నుంచి వస్తున్న వరద ఉద్ధృతికి నార్సింగి ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డు నీట మునిగింది. దీంతో ఆ ప్రాంతంలో రాకపోకలు నిలిపేశారు. నార్సింగి నుంచి ఓఆర్ఆర్లోకి వెళ్లేందుకు అనుమతివ్వడం లేదు. మంచిరేవుల-నార్సింగి దారిలో కూడా మూసీ ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో ఆ దారిని మూసేశారు. ఎంత భారీ వర్షం వచ్చినా మునుపెన్నడూ ఇంత మొత్తంలో వరద రాలేదని స్థానిక ప్రజలు చెప్తున్నారు.