సాధారణంగా ఉప ఎన్నికలు రెండు సందర్భాల్లో జరుగుతాయి. ఒకటి… రెండు చోట్ల పోటీ చేసి గెలిచిన వ్యక్తి ఒక స్థానానికి రాజీనామా చేసినప్పుడు లేదా ఆ స్థానంలో ఉన్న ప్రజా ప్రతినిధి హఠాత్తుగా మరణించినప్పుడు. కానీ మునుగోడు ఉప ఎన్నిక కొందరి వ్యక్తిగత స్వార్థం వల్ల వచ్చింది. ఇది అవాంఛనీయమైన, అనవసరమైన ఎన్నిక. అధికార కాంక్షతో అసంతృప్త వాదులను ఎన్నికల బరిలోకి దింపుతున్న బీజేపీకి తెలంగాణ సమాజమే సరైన రీతిలో బుద్ధి చెప్పాల్సిన తరుణమిది.
నల్గొండ జిల్లా ముఖ్యంగా మునుగోడు ప్రాంతంలో ఆనాడు ఫ్లోరైడ్ ప్రభావం ఎక్కువగా ఉండేది. ప్రజలు అంగ వైకల్యంతో దీనంగా, భారంగా బతుకీడ్చేవారు. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మిషన్ భగీరథ పథకం ద్వారా టీఆర్ఎస్ ప్రభుత్వం ఇంటింటికీ శుద్ధి చేసిన మంచి నీరు సరఫరా చేసి ఫ్లోరైడ్ భూతాన్ని తరిమికొట్టింది. ఈ విధంగా తన, పర అనే భేదం లేకుండా విపక్ష పార్టీలు ఎమ్మెల్యేలుగా ఉన్న నియోజక వర్గాల అభివృద్ధికి కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తున్నది. కానీ టీఆర్ఎస్కు తానే ప్రధాన ప్రత్యర్థినని చెప్పుకొంటున్న రాజ్‌గోపాల్ రెడ్డి నిన్నటి వరకు బీజేపీని విమర్శించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉండి అసెంబ్లీలో ఏనాడూ నియోజకవర్గ సమస్యలు, ప్రజల అవసరాలను ప్రస్తావించలేదు. కానీ ఇప్పుడు సొంత వ్యాపారాల అభివృద్ధి కోసం ఆయన బీజేపీలో చేరి టీఆర్ఎస్తో వాదులాటకు దిగడం నియోజక వర్గ ప్రజలకు మింగుడు పడడం లేదు. అధికారంలోకి వస్తే టీఆర్ఎస్ సంక్షేమ పథకాలు కొనసాగిస్తామని ఒక పక్క బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు చెప్తున్నారు. అవే సంక్షేమ పథకాలను అమలు చేయడానికి మిమ్మల్ని ఎందుకు గెలిపించాలని ప్రజలు అడిగితే సమాధానం చెప్పలేని స్థితిలో బీజేపీ నాయకులు ఉన్నారు.
మునుగోడు నియోజక వర్గంలో టీఆర్ఎస్ తర్వాత కమ్యూనిస్టు పార్టీలు సంస్థాగతంగా బలంగా ఉన్నాయి. ఈసారి ఎన్నికల్లో టీఆర్ఎస్కు కమ్యూనిస్టులు మద్దతు ఇస్తున్నారు. రాజగోపాల్ రెడ్డి స్థానికేతరులు కావడం, ఆర్థిక బలాన్ని నమ్ముకోవడం, ఎప్పుడు ఏ పార్టీతో లాబీయింగ్ చేస్తుంటారో తెలియక ప్రజలు గందరగోళంలో ఉండటం ప్రత్యర్థి పార్టీలకు కలిసి వచ్చిన విషయం. మరోవైపు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు ఇచ్చిన విభజన హామీలు ఒక్కటి కూడా నెరవేర్చలేదు. న్యాయంగా ఇవ్వాల్సిన నిధులు కూడా విడుదల చేయడం లేదు. ప్రైవేటీకరణ, అవినీతి, ధరల పెరుగుదలకు కారణమైన బీజేపీ పట్ల దేశ ప్రజలంతా అసంతృప్తితో ఉన్నారు. ఎన్నికల్లో ఎలా గెలవాలో తెలియక సంతలో పశువులను కొన్నట్లు ఓటర్లను, ప్రజా ప్రతినిధులను కొనుగోలు చేయడానికి డబ్బు ఆశ చూపుతున్నారు బీజేపీ నేతలు.
మరోవైపు తమ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను క్షేత్ర స్థాయిలో ఓటర్లకు వివరించి ఓట్లు అడిగే పనిలో నిమగ్నమయ్యారు టీఆర్ఎస్ నేతలు. మునుగోడు నియోజక వర్గంలో 40,543 మందికి ప్రభుత్వం ఆసరా పింఛన్లు అందజేసింది. మరి కొంత మందికి కూడా త్వరలో పింఛన్లు మంజూరు చేసే అవకాశం ఉంది. 42,148 మంది రైతులకు రూ.220 కోట్ల రుణమాఫీ చేశామని; 1126 మందికి రైతు బీమా ద్వారా రూ.56.36 కోట్లు అందించామని టీఆర్ఎస్ చెబుతున్నది. 8,917 మందికి కల్యాణ లక్ష్మి ద్వారా ఆర్థిక సహాయం అందించామని, ఇలాంటి పథకాలే తమను విజయ తీరాలకు చేరుస్తాయని టీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు.
ఎన్నికల నుండి వ్యాపారులను, మతోన్మాదులను తన్ని తరిమేసి తమదైన విప్లవాత్మక తీర్పును మునుగోడు ప్రజలు ఇవ్వాల్సిన సందర్భమిది. మునుగోడులో దాదాపు 80 శాతం ఓటర్లుగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ బహుజనులు కాన్షీరాం చెప్పినట్లు మనవాడిని గెలిపించడం ముఖ్యం కాదు, మన ప్రధాన శత్రువును ఎట్టి పరిస్థితిలో గెలవనివ్వకూడదు అన్న సూక్తిని పాటించాలి. విజ్ఞతతో ఓటేసి దేశానికి ప్రమాదకరంగా మారిన బీజేపీని తెలంగాణ అంచుకు కూడా రాకుండా చెయ్యాలి.
– ముఖేష్ సామల
97039 73946