భద్రాచలం, డిసెంబర్ 21: భద్రాద్రికి ముక్కోటి శోభ వచ్చింది. భద్రాచలం సీతారామచంద్ర స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో ముక్కోటి ఏకాదశి అధ్యయనోత్సవాలు శుక్రవారం ప్రారంభమవుతాయి. తెప్సోత్సవానికి హంస వాహనం సిద్ధమవుతున్నది. ఉత్తర ద్వార దర్శన మండపం ముస్తాబైంది. ఆలయానికి రంగులు వేయడం, ఆవరణలో చలువ పందిళ్లు.. స్వాగత ద్వారాల ఏర్పాటు వంటి పనులు పూర్తయ్యాయి. రాత్రి వేళ విద్యుద్దీపాల వెలుగుల్లో ఆలయం ధగధగలాడుతున్నది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులకు ఆలయ అధికారులు ఇప్పటికే ఆహ్వాన పత్రికలు అందజేశారు.
ఈ నెల 23 నుంచి జనవరి 12వ తేదీ వరకు అధ్యయనోత్సవాలు కొనసాగుతాయి. పగల్పత్తు, రాపత్తు, విలాసోత్సవాలు, విశ్వరూప సేవ తదితర కార్యక్రమాలు ఉంటాయి. భద్రాద్రి రామయ్య ఈ నెల 23న మత్స్యావతారంలో, 24న కూర్మావతారంలో, 25న వరాహావతారంలో, 26న నరసింహావతారంలో, 27న వామనావతారంలో, 28న పరశురామావతారంలో, 29న శ్రీరామావతారంలో, 30న బలరామావతారంలో, 31న శ్రీకృష్ణావతారంలో భక్తులకు దర్శనమిస్తారు. జనవరి 1న తిరుమంగైళ్వార్ పరమ పదోత్సవం, అదే రోజు సాయంత్రం 4.00 గంటలకు తెప్పోత్సవం నిర్వహిస్తారు. దీంతో పగల్ పత్తు ఉత్సవాలు సమాప్తమవుతాయి. 2వ తేదీ తెల్లవారుజామున 5.00 నుంచి 6.00 గంటల వరకు ఉత్తర ద్వార దర్శనం నేత్రపర్వంగా నిర్వహిస్తారు. అనంతరం స్వామి వారికి తిరువీధి సేవ ఉంటుంది. రాత్రి 8.00 గంటలకు డీఎస్పీ బంగాళాలో రాపత్తు ఉత్సవం ప్రారంభమవుతుంది. 3వ తేదీన అంబా సత్రంలో, 4న కృష్ణాలయంలో, 5న తహసీల్దార్ నివాస గృహానికి ఎదురుగా ఉన్న శ్రీరామదాసు మండపంలో, 6న తాత గుడి సెంటర్లోని గోవింద మండపంలో, 7న పునర్వసు మండపంలో, 8న అభయాంజనేయ స్వామి ఆలయంలోని శ్రీరామదూత మండపంలో రాపత్తు ఉత్సవాలు జరుగుతాయి. 9వ తేదీన కల్కి అవతారం, దొంగల దోపు ఉత్సవం, విశ్రాంత మండప సేవ ఉంటాయి. 10వ తేదీన దమ్మక్క మండపంలో, 11న చిత్రకూట మండపంలో ఉభయ వేదాంతాచార్య పీఠం, జీయర్ మఠం వారి ఉత్సవం, రాత్రి శ్రీ నమ్మాళ్వార్ల పరమ పదోత్సవం, రాపత్తు, శాత్తుమొరై నిర్వహిస్తారు. 12వ తేదీన గ్రామ పంచాయతీ కార్యాలయంలోని శ్రీనృసింహదాస మండపంలో ఇరామానుశనూత్తందాది సేవ ఉంటుంది. 13, 14, 15 తేదీల్లో రామయ్యకు విలాసోత్సవాలు నిర్వహిస్తారు. 19న విశ్వరూప సేవ నయనానందకరంగా జరుపుతారు.
పర్ణశాల రామాలయంలో ఈ నెల 23 నుంచి ప్రయుక్త అధ్యయనోత్సవాలు ప్రారంభమవుతాయని అర్చకులు కిరణ్కుమారాచార్యులు, భార్గవాచార్యులు ఒక ప్రకటనలో తెలిపారు.