Mudragada Padmanabham | కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం (73) అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సీఎం చంద్రబాబు నాయుడు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అయితే కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ముద్రగడ పద్మనాభం కుటుంబసభ్యులు తిరస్కరించారు.
బతికున్న సమయంలో ముద్రగడను అనేక విధాలుగా అవమానించారని.. ఇప్పడు అధికారిక గౌరవాలు, సానుభూతి అవసరం లేదని ఆయన కుటుంబసభ్యులు స్పష్టం చేశారు. కాకినాడ జిల్లా కిర్లంపూడిలో బుధవారం మీడియాతో మాట్లాడిన వైసీపీ నేత జక్కంపూడి రాజా ఈ విషయాన్ని మీడియాకు వెల్లడించారు. ముద్రగడ అధికారం వెంట పరిగెత్తిన వ్యక్తి కాదని.. ప్రజా సమస్యలపై పోరాడిన నాయకుడు అని తెలిపారు. ఆయన బతికున్నప్పుడు ఇబ్బందులకు గురిచేసి.. ఇప్పుడు మరణించిన తర్వాత మొసలి కన్నీరు కార్చాల్సిన అవసరం లేదని అన్నారు.
ముద్రగడ పద్మనాభం 1953 జనవరి 22న ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడిలో జన్మించారు. ముద్రగడది రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం. ఆయన తండ్రి వీర రాఘవరావు రాజకీయాల్లో క్రియాశీలంగా పనిచేశారు. పద్మనాభం 1978లో జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రత్తిపాడు నుంచి జనతాపార్టీ అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు.
ఆ తరువాత 1983, 1985, 1989 అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా ప్రత్తిపాడు నుంచి విజయం సాధించారు. సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో రెండుసార్లు రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. తర్వాత కాకినాడ నుంచి లోక్సభ సభ్యుడిగా గెలుపొందారు. ఆయన మొదటి నుంచి రాజకీయ పదవుల కంటే కాపు సామాజిక వర్గాన్ని వెనుకబడిన తరగతుల జాబితాలో చేర్చాలని చేసిన పోరాటాలతో తెలుగు రాష్ర్టాల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. కాపు రిజర్వేషన్ల సాధన కోసం ఆయన తన జీవిత కాలంలో ఏడు సార్లు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు