Covid-19 : దేశంలో కొవిడ్-19 కేసులు (Covid-19 cases) మరోసారి నెమ్మదిగా చాపకింద నీరులా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. వాతావరణంలో మార్పులవల్ల వచ్చే సాధారణ జ్వరాలుగా భావించి చాలామంది కోవిడ్ లక్షణాల (Covid symptems) ను నిర్లక్ష్యం చేస్తున్నారు. ఈ నిర్లక్ష్యంవల్ల వైరస్ వేగంగా వ్యాపించే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఏ చిన్న అనుమానాస్పద లక్షణం కనిపించినా స్వీయ వైద్యం చేసుకోకుండా, వెంటనే పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు.
ప్రస్తుతం నమోదవుతున్న కొవిడ్ కేసులలో ప్రధానంగా జ్వరం, నిరంతరాయంగా వచ్చే పొడి దగ్గు, తీవ్రమైన ఒళ్లు నొప్పులు కనిపిస్తున్నాయని వైద్యులు తెలిపారు. వీటితోపాటు విపరీతమైన అలసట, గొంతు నొప్పి, వాసన లేదా రుచి కోల్పోవడం వంటి లక్షణాలు ఉంటే ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఐసోలేషన్లో ఉండాలని స్పష్టం చేస్తున్నారు. ముఖ్యంగా వృద్ధులు, శ్వాసకోశ సమస్యలు, మధుమేహం, ఇతర దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు మరింత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.
పండుగలు, జాతరలు రద్దీగా ఉండే ప్రాంతాలకు వెళ్లేటప్పుడు కచ్చితంగా మాస్కులు ధరించాలని, శానిటైజర్ వాడకం, భౌతిక దూరం పాటించడం వంటి ముందస్తు జాగ్రత్తలను మళ్లీ అలవాటు చేసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.