హైదరాబాద్ : నారాయణపేట జిల్లాలో గురుకుల కళాశాల విద్యార్థిని ఆత్మహత్యాయత్నం కేసులో కొత్త విషయాలు వెలుగులో కొచ్చాయి. మద్దూర్ మండలంలోని కేజీబీవీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న ఉట్కూర్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక తమ సమీప బంధువైన యువకుడు ఆమెను కలిసేందుకు రెండు రోజుల కింద కేజీబీవీ వద్దకు వచ్చాడు. కేజీబీవీ సిబ్బంది అతడితో బయట నుంచి మాట్లాడేందుకు అనుమతించారు.
ఇదే సమయంలో అనుమానం వచ్చి యువకుడి గురించి తెలుసుకునేందుకు బాలిక తల్లిదండ్రులకు సమాచారమిచ్చారు. మరుసటి రోజు పాఠశాలకు వచ్చిన బాలిక తల్లిదండ్రులు యువకుడి గురించి ఆరా తీసేందుకు తమ కూతురిని పిలిపించుకున్నారు. అయితే ఈ విషయం తల్లిదండ్రులకు తెలిసిపోతుందనే భయంతో పాఠశాల భవనం రెండో అంతస్తు నుండి కిందకు దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.
కాగా, తీవ్ర గాయాలపాలైన బాలిక దవాఖానలో చికిత్స పొందుతున్నది.