హైదరాబాద్: మల్లా రెడ్డి విశ్వవిద్యాపీఠ్, టారుటియం గ్లోబల్ కన్సల్టింగ్ భాగస్వామ్యంతో హైదరాబాద్ క్యాంపస్‌లో ‘సూత్ర–సీహెచ్ తెలంగాణ లీడర్షిప్ రౌండ్‌టేబుల్’ సమావేశాన్ని నిర్వహించారు. వాతావరణ మార్పుల వల్ల ఏర్పడుతున్న ఒత్తిళ్లను.. తెలంగాణ ఆరోగ్య వ్యవస్థలు సమర్థంగా ఎలా ఎదుర్కోవాలనే అంశంపై చర్చించారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వేడి ఒత్తిడి (హీట్ స్ట్రెస్), వాయు కాలుష్యం, నీటి కొరత, దోమల ద్వారా వ్యాపించే వ్యాధుల ప్రభావం, అలాగే ఆస్పత్రులు , ప్రజారోగ్య మౌలిక వసతులపై చూపుతున్న ఒత్తిడిపై చర్చ చేపట్టారు.
హైదరాబాద్ మెట్రోపాలిటన్ ఏరియా, క్రీడల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. వాతావరణ మార్పులు ప్రజారోగ్య ఫలితాలపై పెరుగుతున్న ప్రభావాన్ని చూపుతున్నాయని, ఆరోగ్య వ్యవస్థలపై కొత్త సవాళ్లను విసురుతున్నాయని, ఈ సవాళ్లను ఎదుర్కోవడానికి ప్రభుత్వం, విద్యాసంస్థలు, ఆరోగ్య సంస్థలు, పరిశ్రమల మధ్య మరింత బలమైన సహకారం అవసరమని ఆయన పేర్కొన్నారు. తెలంగాణలో హీట్‌వేవ్స్, వాటి ప్రభావం ప్రజారోగ్యం, శ్రామికుల ఉత్పాదకత, ఆరోగ్య సేవలపై ఎలా పడుతోందనే అంశంపై చర్చల్లో ప్రధానంగా దృష్టి సారించారు.
సూత్ర–సీహెచ్(Sutra–CH Initiative) ఇనిషియేటివ్‌లో వాతావరణ మార్పులు మరియు ఆరోగ్య రంగంలో పనిచేస్తున్న సంస్థలను అనుసంధానించాలని, పరిశోధనా భాగస్వామ్యాలను ప్రోత్సహించాలని, విస్తృత స్థాయిలో అమలు చేయగల ప్రజారోగ్య పరిష్కారాల అభివృద్ధికి తోడ్పడాలని నిర్ణయించారు. క్లైమేట్ అండ్ హెల్త్ ఇన్నోవేషన్ చాలెంజ్ (సీహెచ్ఐసీ) 1.0 లో భాగంగా వాతావరణ మార్పులతో అనుసంధానమైన ప్రజారోగ్య సమస్యలకు పరిష్కారాలను అభివృద్ధి చేస్తున్న విద్యార్థులు, పరిశోధకులు, స్టార్టప్‌లు, ఆరోగ్య నిపుణుల కోసం ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించారు.
మల్లా రెడ్డి విశ్వవిద్యాపీఠ్ చైర్మన్ డా. భద్రా రెడ్డి మాట్లాడుతూ వాతావరణ మార్పులు పర్యావరణ సమస్య మాత్రమే కాకుండా ప్రజారోగ్య సమస్యగా కూడా మారాయన్నారు. అభివృద్ధి చెందుతున్న సవాళ్లను ఎదుర్కొనేందుకు పరిశోధన, ఆవిష్కరణలు, ఆరోగ్య నైపుణ్యం, పరిశ్రమల భాగస్వామ్యాలను ఒకే వేదికపైకి తీసుకురావడంలో విశ్వవిద్యాలయాలు కీలక పాత్ర పోషిస్తున్నట్లు చెప్పారు. సూత్ర–సీహెచ్ వంటి కార్యక్రమాల ద్వారా ఆరోగ్య వ్యవస్థల సామర్థ్యాన్ని బలోపేతం చేసే, సుస్థిర అభివృద్ధికి తోడ్పడే అర్థవంతమైన భాగస్వామ్యాలను ఏర్పాటు చేయడమే తమ లక్ష్యమని అన్నారు. మల్లారెడ్డి విశ్వవిద్యాపీఠ్ వైస్ చైర్మన్ డా. ప్రీతి రెడ్డి మాట్లాడుతూ వాతావరణ మార్పుల వల్ల కలిగే ఆరోగ్య ప్రభావాలను ఒక్క సంస్థ మాత్రమే పరిష్కరించలేదన్నారు. విద్యాసంస్థలు, ప్రభుత్వం, ఆరోగ్య సేవల సంస్థలు, పరిశ్రమల మధ్య భాగస్వామ్యాలు అవసరమన్నారు.
టారుటియం గ్లోబల్ కన్సల్టింగ్ ప్రతినిధులు మాట్లాడుతూ.. వాతావరణ మార్పులు–ఆరోగ్యంపై జరుగుతున్న చర్చలను కేవలం సంభాషణలకే పరిమితం చేయకుండా, విధానాలు, సాంకేతికత, పరిశోధన, మౌలిక వసతుల రంగాల్లో స్పష్టమైన భాగస్వామ్యాల దిశగా తీసుకెళ్లాలని కోరారు.