న్యూశాయంపేట, అక్టోబర్ 26: ఎస్సీ వర్గీకరణను అమలు చేయకపోతే రేవంత్‌రెడ్డి సరార్తో యు ద్ధాన్ని కొనసాగిస్తామని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన వెంటనే అసెంబ్లీ సాక్షిగా దేశంలో తామే మొదట వర్గీకరణ అమలు చేస్తామని, అన్ని నోటిఫికేషన్లకు వర్తించేలా ఆర్డినెన్స్ తెస్తామని మోసపూరిత మాటలు చెప్పిన సీఎం.. ఎస్సీ వర్గీకరణ లేకుండానే ఉద్యోగాలను భర్తీ చేస్తూ నమ్మకద్రోహం చేస్తున్నాడని మండిపడ్డారు. హనుమకొండ హంటర్‌రోడ్‌లోని డీ-కన్వెన్షన్ హాల్లో ఉమ్మడి వరంగల్ జిల్లా మాదిగల ధర్మయుద్ధ మహాసభ నిర్వహించారు. ఈ సందర్భంగా మందకృష్ణ మాట్లాడుతూ.. రేవంత్‌రెడ్డిని నమ్మితే ఎంత మోసం చేస్తాడో టీచర్ల ఉద్యోగాల నియామకాలతో తేలిపోయిందని అన్నారు. 11 వేలకుపైగా ఉద్యోగాల్లో ఎస్సీ వర్గీకరణ లేకపోవడం వల్ల మాదిగ, మాదిగ ఉప కులాలు తీవ్రంగా నష్టపోయాయని, మళ్లీ గ్రూపు-1,2,3,4, వివిధ విభాగాల్లో ఉద్యోగాలను కూడా దకకుండా రేవంత్‌రెడ్డి కుట్రలు పన్నుతున్నారని మండిపడ్డారు.