మూసీ నది పరీవాహక ప్రాంతంలో ప్రభుత్వం మరో మారు కూల్చివేతలు చేపట్టేందుకు సన్నద్ధమైంది. ఇప్పటి వరకు మొదటి దఫా జరిగిన విషయం తెలిసిందే. కాగా, పండుగ నేపథ్యంలో కూల్చివేతలకు ఫుల్స్టాప్ పెట్టినట్టే పెట్టి, కూల్చివేతల కొనసాగింపు చర్యలు చేపట్టేందుకు రంగ సిద్ధం చేసింది. పేదల ఇండ్లపైకి బుల్డోజర్లను ఉసిగొల్పేందుకు రెండో దఫా ధ్వంస రచన చేసింది. అయితే, నగరంలో 55 కిలో మీటర్ల విస్తరించిన మూసీ పరీవాహకంలో 2100ల అక్రమ నిర్మాణాలున్నట్టు జిల్లా అధికార యంత్రాంగం గుర్తించింది. ఇదిలా ఉండగా, దీపావళి పండుగ అనంతరం, మూడో దఫా సైతం కూల్చివేతలు చేపట్టేందుకు వ్యూహం సిద్ధం చేసినట్టు తెలిసింది.
సిటీబ్యూరో, అక్టోబర్ 15(నమస్తే తెలంగాణ): మూసీ వెంబడి మరో దఫా కూల్చివేతలకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే కూల్చివేతల బాధ్యతలను జిల్లా అధికారులకు అప్పగించి చేతులు దులుపుకున్న మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ అథారిటీ.., ఇక రెండో దశలోనూ పేదల ఇండ్లపైకి బుల్డోజర్లను ఉసిగొల్పనుంది. మూసీ ఆక్రమణలను తొలగిస్తామని, ప్రాజెక్టు విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదంటూ చకచకా కూల్చివేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇప్పటికే రివర్ బెడ్ ప్రాంతంలో దాదాపు 2100 నిర్మాణాలు ఉన్నట్లుగా గుర్తించారు. వాటన్నింటినీ దశల వారీగా ఈ నెలాఖరులోగా కూల్చివేసిన వెంటనే, దీపావళి తర్వాత మూడో దఫా ఆక్రమణలు, నిర్మాణాల గుర్తింపు, కూల్చివేతలకు కసరత్తు మరో మారు చేపట్టేందుకు వ్యూహరచన చేస్తున్నట్టు తెలిసింది.
నగరంలో 55 కిలోమీటర్ల మేర..
హైదరాబాద్ నగరంలో 55 కిలోమీటర్లు మేర విస్తరించిన మూసీ నదికి ఇరువైపులా రెండోసారి కూల్చివేతలు చేపట్టేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఆయా జిల్లాల వారీగా ఇప్పటికే సేకరించిన సోషియో ఎకానమిక్ సర్వే, ముందుగానే గుర్తించిన రివర్ బెడ్ మ్యాపుల ఆధారంగా నిర్మాణాలను మూసీలో కలపనున్నారు. రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ జిల్లాల రెవెన్యూ, ఇరిగేషన్ మ్యాపులతో క్రోడీకరించిన మార్గాల వారీగా మార్కింగ్ చేశారు. వాటన్నింటినీ దశల వారీగా కూల్చేయనున్నారు. ఇప్పటికే మూడు జిల్లాల రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులతో ఎంఆర్డీసీఎల్ సమన్వయ సమావేశం కూడా పూర్తి చేసింది. ఇక కూల్చివేతలను జిల్లా యంత్రాంగమే పర్యవేక్షించాలని మూసీ అథారిటీ ఆదేశాలు జారీ చేసింది.
లెక్కకు మించి నిర్మాణాలు..
దశల వారీగా మూసీ వెంబడి నిర్మాణాలను కూల్చివేస్తోంది. ప్రస్తుతం మూసీ రివర్ బెడ్ ప్రాంతంలోని నిర్మాణాల గుర్తింపు, మార్కింగ్, కూల్చివేతలను చేపట్టనుంది. అయితే, జిల్లా అధికారులు గుర్తించినట్లుగా మూడు జిల్లాల పరిధిలో 2100 కంటే ఎక్కువ ఉన్నట్లుగా రెవెన్యూ, ఇరిగేషన్ మ్యాపుల ద్వారా తెలిసింది. కూల్చివేతలపై ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకే సమన్వయ సమావేశం నిర్వహించినట్లుగా ఎంఆర్డీసీఎల్ వర్గాలు తెలిపాయి. రివర్ బెడ్ నిర్మాణాల కూల్చివేతలు పూర్తి కాగానే, ఎఫ్ఆర్ఎల్ పరిధిలో ఉన్న ఆస్తులు, నిర్మాణాలు, కట్టడాలను గుర్తించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని, ప్రధానంగా కోర్టు వ్యవహారాలతో కూల్చివేతలకు ఆటంకం లేకుండా ఉండేలా తగిన ఆధారాలు సమకూర్చుకోవాలని సూచించినట్లు తెలిసింది.