హైదరాబాద్, నవంబర్ 28 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ధాన్యం సేకరణపై సోమవారం నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు సమావేశాల్లో కేం ద్ర ప్రభుత్వాన్ని నిలదిస్తామని టీఆర్ఎస్ లోక్‌సభాపక్ష నేత నామా నాగేశ్వర్రావు తెలిపా రు. రైతులపై పెనుభారం మోపే లా కేంద్రం తీసుకొస్తున్న విద్యుత్తు బిల్లును వెనక్కి తీసుకోవాలని, పంటలన్నింటికీ కనీస మద్దతు ధర కల్పించేలా చట్టం చేయాలని డిమాండ్ చేశారు. రైతుల సమస్యలపై పార్లమెంట్ లోపల బయట టీఆర్ఎస్ పోరాడుతుందని స్పష్టంచేశారు. పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో ఆదివారం కేంద్రప్రభుత్వం నిర్వహించిన అఖిలపక్ష సమావేశానికి టీఆర్ఎస్ తరుఫున నామా నాగేశ్వర్రావు, బండ ప్రకాశ్ హాజరయ్యా రు.
అనంతరం నామా మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో ధాన్యం మొత్తాన్ని సేకరించాల్సిన బాధ్యత కేంద్రంపై ఉన్నదని అన్నారు. దీనిపై రెండు నెలలుగా సీఎం కేసీఆర్‌తోపాటు, రాష్ట్ర మంత్రులు, అధికారులు కేంద్ర మంత్రులను ఎన్నిసార్లు కలిసి విజ్ఞప్తిచేసినా ఇప్పటివరకు స్పష్టమైన వైఖరి తెలుపలేదని విమర్శించారు. యాసంగి పంటను ఆసలే తీసుకోబోమని చెప్తున్నారని, వానకాలం పంటను ఎంత కొంటరో చెప్పడంలేదని అసహనం వ్యక్తంచేశారు. ఈ అంశాన్ని అఖిలపక్ష భేటీకి హాజరైన కేంద్రమంత్రి పీయూష్ గోయల్ దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు.
కృష్ణా జలాల పంపిణీకి ట్రిబ్యునల్ ఏర్పాటుచేయాలని నామా డిమాండ్‌చేశారు. రాష్ట్ర విభజన జరిగి ఏడేండ్లయినా ఇంతవరకు కృష్ణా జలాల పంపకం పూర్తిచేయలేదని, సీఎం కేసీఆర్ అనేకసార్లు విన్నవించినా కేంద్రం సరిగా స్పందించడంలేదని విమర్శించారు. రాష్ట్ర విభజన చట్టంలోని హామీలన్నీ నెరవేర్చాలని కేంద్రాన్ని డిమాండ్‌చేశారు. తెలంగాణ అసెంబ్లీ తీర్మానం చేసి పంపించినా ఎస్సీ విభజన, ఎస్టీలు, మైనార్టీ రిజర్వేషన్లపై స్పందన లేదని ఆగ్రహంవ్యక్తంచేశారు. కేంద్రం ఈ సమావేశాల్లో తీసుకొచ్చే బిల్లుల్లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఎస్సీ, ఎస్టీ సవరణ బిల్లులు ఉన్నాయని, వాటిల్లో తెలంగాణకు సంబంధించిన బిల్లులను కూడా చేర్చాలని నామా డిమాండ్‌చేశారు. దేశంలోని ప్రధాన సమస్యలపై పార్లమెంట్లో చర్చ కోసం ప్రజలందరూ ఎదురుచూస్తున్నారని, కేంద్రం వీటిపై చర్చించేందుకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.
వ్యవసాయ బిల్లులను రద్దు చేస్తామని చెప్తూనే కేంద్రం పార్లమెంట్ సమావేశాల ఎజెండాలో విద్యుత్తు బిల్లును చేర్చిందని నామా నాగేశ్వర్ రావు విమర్శించారు. విద్యుత్తు బిల్లును టీఆర్ఎస్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నదని చెప్పారు. ఈ బిల్లు చట్టంగా మారితే రైతులపై పెను ఆర్థికభారం పడుతుందని ఆందోళన వ్యక్తంచేశారు. కేంద్రం ఈ చట్టాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌చేశారు. లేదంటే రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుందని, రైతులకు టీఆర్ఎస్ అండగా నిలుస్తుందని స్పష్టంచేశారు. అన్నిరకాల పంటలకు కనీస మద్దతు ఉండేలా చట్టంచేయాలని కేంద్రాన్ని నామా డిమాండ్‌చేశారు. ప్రస్తుతం కేంద్రం ప్రకటిస్తున్న కనీస మద్దతు ధర క్షేత్రస్థాయిలో అమలు కావడంలేదని, కొన్ని పంటలకు ఎంఎస్పీ లేనేలేదని గుర్తుచేశారు.