అమరావతి : విజయవాడ ఎంపీ కేశినేని నాని(MP Keshineni Nani) టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు (Chandrababu) పై మరోసారి విరుచుకుపడ్డారు. టీడీపీ నుంచి బయటకు వచ్చిన తరువాత చంద్రబాబు కొంత మంది ఊర కుక్కల్ని(టీడీపీ నాయకులు) తనపై ఉసిగొల్పుతున్నాడని దుయ్యబట్టారు. మంగళవారం విజయవాడలోని వైసీపీ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు.
టీడీపీ(TDP) నుంచి వెళ్లేవాళ్లను విమర్శించడమే వాళ్ల పని అని విమర్శించారు. ఎక్కువగా తిట్టే వారికి పదవులు ఇవ్వడం చంద్రబాబు నైజమని ఆరోపించారు. అయితే ఎవరెన్నీ ఆరోపణలు చేసినా తాను భమపడనని వెల్లడించారు. ఏపీలో సొంతిళ్లు లేని చంద్రబాబుకు రాబోయే ఎన్నికలు చివరి ఎన్నికలని, ఓటమి తరువాత సొంత రాష్ట్రమైన తెలంగాణకు వెళ్లిపోవడానికి సిద్ధమవుతున్నారని పేర్కొన్నారు. చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని కమిషన్ల కోసం టీడీపీ అధ్యక్షుడు హడావిడగా శంకుస్థాపన చేశారని ఆరోపించారు.