moto g57 Power | స్మార్ట్ ఫోన్లలో ఒకప్పుడు 3000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటే వాహ్.. అనేవారు. కానీ తరువాత 4500 ఎంఏహెచ్ కు తరం మారింది. తరువాత 5000 ఎంఏహెచ్ కెపాసిటీ ఉన్న బ్యాటరీ కలిగిన ఫోన్లను వినియోగదారులు కొనుగోలు చేయడం మొదలు పెట్టారు. ఇప్పటికీ ఇవే ఫోన్లు మార్కెట్లో అధికంగా ఉన్నాయి. కానీ ఇప్పుడు మళ్లీ స్మార్ట్ ఫోన్ల బ్యాటరీ కెపాసిటీ తరం మారిందనే చెప్పవచ్చు. ప్రస్తుతం అన్ని కంపెనీలు 7000 ఎంఏహెచ్ బ్యాటరీ కెపాసిటీ ఉన్న ఫోన్లనే రూపొందించి వినియోగదారులకు అందిస్తున్నాయి. ఈ ఫోన్లకు ప్రస్తుతం మార్కెట్లో డిమాండ్ ఎక్కువగా ఉంది. ప్రస్తుతం ఫోన్లను చాలా మంది అధికంగా వినియోగిస్తున్నారు. దీంతో బ్యాటరీ కెపాసిటీ సరిపోవడం లేదు. ఈ క్రమంలోనే స్మార్ట్ ఫోన్ కంపెనీలు ఒక అడుగు ముందుకు వేసి ఏకంగా 7000 ఎంఏహెచ్ కెపాసిటీ ఉన్న బ్యాటరీ కలిగిన ఫోన్లను తయారు చేసి వినియోగదారులకు అందిస్తున్నాయి. దీంతో వారు కూడా ఇవే ఫోన్లను ఎక్కువగా కొంటున్నారు. ఇక ఇదే కోవలో మోటోరోలా కూడా తాజాగా ఇలాంటి ఫీచర్‌తోనే మరో నూతన స్మార్ట్ ఫోన్‌ను విడుదల చేసింది. మోటో జి57 పవర్ పేరిట ఓ నూతన స్మార్ట్ ఫోన్‌ను భారత మార్కెట్లో ప్రవేశపెట్టారు.
మోటో జి57 పవర్ స్మార్ట్ ఫోన్లో పలు ఆకట్టుకునే ఫీచర్లను అందిస్తున్నారు. పైగా దీని ధర కూడా తక్కువగానే ఉండడం విశేషం. ఈ ఫోన్లో 6.7 ఇంచుల ఎల్సీడీ డిస్ప్లేను ఏర్పాటు చేశారు. దీనికి ఫుల్ హెచ్డీ ప్లస్ రిజల్యూషన్ ను, 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌ను అందిస్తున్నారు. అందువల్ల డిస్ప్లే చాలా క్వాలిటీగా ఉంటుంది. నాణ్యమైన దృశ్యాలను తెరపై వీక్షించవచ్చు. ఈ ఫోన్లో స్నాప్ డ్రాగన్ 6ఎస్ జెన్ 4 ఆక్టాకోర్ ప్రాసెసర్‌ను ఏర్పాటు చేశారు. 8జీబీ ర్యామ్ లభిస్తుంది. ర్యామ్‌ను అదనంగా మరో 16జీబీ వరకు వర్చువల్‌గా పెంచుకునే వీలు కల్పించారు. అందువల్ల ఫోన్ చాలా వేగవంతమైన ప్రదర్శనను ఇస్తుందని చెప్పవచ్చు. ఇక ఈ ఫోన్లో వెనుక వైపు 50 మెగాపిక్సల్ మెయిన్ కెమెరా ఉండగా, మరో 8 మెగాపిక్సల్ అల్ట్రా వైడ్ కెమెరాను ఏర్పాటు చేశారు. ముందు వైపు 8 మెగాపిక్సల్ కెమెరా ఉంది.
ఈ ఫోన్లో ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్ లభిస్తుంది. ఈ ఫోన్‌కు గాను ఆండ్రాయిడ్ 17 ఓఎస్ అప్డేట్ను, 3 ఏళ్ల వరకు సెక్యూరిటీ అప్డేట్స్ను అందిస్తామని కంపెనీ చెబుతోంది. ఈ ఫోన్‌కు ఐపీ64 డస్ట్ అండ్ వాటర్ స్ల్పాష్ రెసిస్టెన్స్ ఫీచర్‌ను అందిస్తున్నారు. ఈ ఫోన్ డిస్ప్లేకు గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ కూడా ఉంది. ఈ ఫోన్లో ఏకంగా 7000 ఎంఏహెచ్ భారీ కెపాసిటీ ఉన్న బ్యాటరీని ఏర్పాటు చేశారు. ఈ ఫోన్‌కు ఇదే ప్రధాన ఆకర్షణగా చెప్పవచ్చు. ఈ ఫోన్‌ను ఫుల్ చార్జింగ్ చేస్తే సాధారణ వాడకానికి 3 రోజుల వరకు బ్యాటరీ బ్యాకప్ వస్తుందని కంపెనీ చెబుతోంది. ఇక ఈ ఫోన్‌కు 30 వాట్ల మేర ఫాస్ట్ చార్జింగ్కు సపోర్ట్‌ను అందిస్తున్నారు. ఈ ఫోన్‌ను 8జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్ సింగిల్ వేరియెంట్లో లాంచ్ చేశారు. డ్యుయల్ సిమ్‌లను వేసుకోవచ్చు. ఫింగర్ ప్రింట్ సెన్సార్ పక్క భాగంలో ఉంది. 3.5 ఎంఎం ఆడియో జాక్‌ను కూడా ఇచ్చారు. డాల్బీ అట్మోస్ సదుపాయం ఉంది. కనుక ఆడియో చాలా క్వాలిటీగా ఉంటుంది. మిలిటరీ గ్రేడ్ నాణ్యతతో ఈ ఫోన్‌ను రూపొందించారు. కనుక ఈ ఫోన్ అంత సులభంగా పగలదు.
మోటో జి57 పవర్ స్మార్ట్ ఫోన్లో 5జి సేవలను ఉపయోగించుకోవచ్చు. డ్యుయల్ 4జి వీవోఎల్టీఈ ఫీచర్ కూడా లభిస్తుంది. వైఫై 6, బ్లూటూత్ 5.1, యూఎస్బీ టైప్ సి వంటి అదనపు సదుపాయాలను సైతం ఇందులో అందిస్తున్నారు. ఇక ఈ ఫోన్‌ను పాంటోన్ రెగాట్టా, పాంటోన్ కార్సెయిర్, పాంటోన్ ఫ్లుయిడిటీ కలర్ ఆప్షన్లలో లాంచ్ చేశారు. ఈ ఫోన్‌కు చెందిన 8జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ సింగిల్ వేరియెంట్ ధరను రూ.14,999గా నిర్ణయించారు. ఈ ఫోన్‌ను డిసెంబర్ 3 నుంచి ఫ్లిప్‌కార్ట్‌తోపాటు మోటోరోలా ఆన్లైన్ స్టోర్, అన్ని ఆఫ్ లైన్ స్టోర్లలో విక్రయించనున్నారు. లాంచింగ్ సందర్భంగా ఈ ఫోన్‌పై పలు ఆఫర్లను సైతం అందిస్తున్నారు. ఎస్బీఐ లేదా యాక్సిస్ బ్యాంకు కార్డులతో ఈ ఫోన్‌ను కొంటే రూ.1000 డిస్కౌంట్ ఇస్తారు. పాత ఫోన్లను ఎక్స్ఛేంజ్ చేస్తే రూ.1000 అదనపు ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ కూడా లభిస్తుంది. అలాగే మరో రూ.1000ని లిమిటెడ్ పీరియడ్ స్పెషల్ డిస్కౌంట్ కింద అందిస్తున్నారు. ఈ ఫోన్‌పై 3 లేదా 6 నెలల నో కాస్ట్ ఈఎంఐ సదుపాయం కూడా అందుబాటులో ఉంది.