భాగ్పాత్: ఉత్తరప్రదేశ్‌లోని భాగ్పాత్లో తీవ్ర విషాదం నెలకొన్నది. పెళ్లి వేదిక వద్దకు వెళ్తున్న వరుడు(Groom Dies) అనూహ్య రీతిలో మృతిచెందాడు. తన వాహనాన్ని ఆపి రోడ్డుపై వాంతులు చేసుకుంటుండగా.. ఎదురుగా వచ్చిన మరో వాహనం ఆ వరుడిని ఢీకొట్టింది. ఈ ఘటనలో అతను ప్రాణాలు కోల్పోయాడు. బిన్నౌలీ పోలీసు స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. పిచోక్రా గ్రామానికి చెందిన వరుడు సుబోద్ కుమార్ ఈ ప్రమాదం ప్రాణాలు కోల్పోయాడు. వివరాల్లోకి వెళ్తే..
ఆదివారం రాత్రి బరాత్‌తో వరుడు సుబోద్ కుమార్ పెళ్లి కోసం బయలుదేరి వెళ్లాడు. సరూర్పుర్ కలాన్ చేరుకున్న తర్వాత ఆ ఊరేగింపును ఆపేశారు. పంచాయితీ హౌజ్ వద్ద స్నాక్స్, డిన్నర్ కోసం వాహనాన్ని నిలిపారు. అయితే పెళ్లి కుమారుడు సుబోధ్ కొంత అనారోగ్యానికి గురయ్యాడు. రోడ్డు మీదకు వెళ్లి వాంతులు చేసుకున్నాడు. ఆ సమయంలో వేగంగా వస్తున్న ట్రక్కును వరుడిని ఢీకొట్టింది. కొన్ని మీటర్ల వరకు పెళ్లి కుమారుడిని ఆ ట్రక్కు లాక్కెళ్లింది. పెళ్లికి వచ్చిన అతిథులు అతన్ని ఆస్పత్రికి తరలించారు. కానీ వరుడు మృతిచెందినట్లు డాక్టర్లు తేల్చారు.
బిన్నౌలీ పోలీసు స్టేషన్ అధికారులు ఆ వరుడి మృతదేహాన్ని పోస్టుమార్టమ్‌కు పంపారు. సీసీటీవీ ద్వారా ట్రక్కు డ్రైవర్ కోసం గాలిస్తున్నారు. కుటుంబం ఇచ్చే ఫిర్యాదు ఆధారంగా కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేపట్టనున్నారు.