తిరుపతి : తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు( Padmavati Brahmotsavam) వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎనిమిదో రోజు సోమవారం రథోత్సవం(Rathotsavam ) ఆలయ నాలుగు మాడ వీధుల్లో సాగింది. భక్తులు పెద్ద సంఖ్యలో రథాన్ని లాగారు.

సర్వాలంకార శోభితమైన రథంలో ప్రకాశించే అలమేలు మంగ సకలదేవతా పరివారంతో వైభవోపేతంగా తిరువీధులలో విహరించారు. అనంతరం అమ్మవారికి రథమండపంలో శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పసుపు, చందనం, పాలు, పెరుగు, తేనె, పన్నీరు, వివిధ రకాల ఫలాలతో అభిషేకం చేసి అమ్మవారిని విశేషంగా అలంకరించారు.
రాత్రి అమ్మవారు అశ్వవాహనంపై దర్శనం ఇవ్వనున్నారని ఆలయ అర్చకులు తెలిపారు. రథోత్సవంలో తిరుమల పెద్ద జీయర్‌స్వామి, చిన్న జీయర్‌స్వామి, ఈవో అనిల్ కుమార్ సింఘాల్, జేఈవో వి. వీర బ్రహ్మం, సివిఎస్వో కే.వి. మురళీకృష్ణ, ఆలయ డిప్యూటీ ఈవో హరింధ్రనాథ్, ఆలయ అర్చకులు బాబు స్వామి, శ్రీనివాసా చార్యులు, అర్చకులు పాల్గొన్నారు.