Telangana | డబ్బుల కోసం ఓ తల్లి అమానుష చర్యకు దిగింది. తన భర్త కూలీ డబ్బుల కోసం గొడవపడ్డ ఆమె.. తన ఒడిలో ఉన్న రెండు నెలల చిన్నారిని చెత్త ట్రాక్టర్ టైర్ల కిందకు విసిరేసింది. మెదక్ జిల్లాలో జరిగిన శనివారం జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
వివరాల్లోకి వెళ్తే.. మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం ముప్పిరెడ్డిపల్లికి చెందిన సంధ్య- స్వామి భార్యాభర్తలు. స్వామి కొంతకాలం గ్రామంలో చెత్త సేకరణ పనికి వెళ్లాడు. ఆ డబ్బులు తనకే ఇవ్వాలని స్వామితో సంధ్య పట్టుబట్టింది. ఇంకా కూలీ డబ్బులు ఇవ్వలేదని చెప్పడంతో.. నేరుగా చెత్త బండి సిబ్బందికి వద్దకు వెళ్లి గొడవ పెట్టుకుంది. వారు కూడా తమకు సంబంధం లేదని గ్రామ పంచాయతీ నుంచి డబ్బులు ఇస్తారని తెలిపారు. దీంతో ఆగ్రహానికి గురైన సంధ్య.. తన రెండు నెలల చిన్నారిని అక్కడే ఉన్న చెత్త సేకరించే ట్రాక్టర్ టైర్ల కిందకు విసిరేసింది. ఇది గమనించిన స్థానికులు చిన్నారిని రక్షించారు. అలాగే శిశు సంరక్షణ కేంద్రం, అంగన్వాడీ సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో ఘటనాస్థలికి వచ్చిన వారు.. సంధ్యకు కౌన్సిలింగ్ ఇచ్చారు. శనివారం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్గా మారింది.