Fatigue | ప్రస్తుతం చాలా మంది ఉరుకుల పరుగుల బిజీ జీవితం కారణంగా తరచూ అలసటకు గురవుతున్నారు. అలసట అనేది ప్రస్తుతం చాలా మందికి కామన్ సమస్యగా మారింది. రాత్రంతా సరిగ్గా నిద్రపోయినా, ఆహారం సమయానికి తీసుకున్నా కూడా పలు ఇతర కారణాల వల్ల కూడా చాలా మంది అలసటకు గురవుతున్నారు. నిద్రలేమి, పోషకాహార లోపం, వ్యాయామం లేదా శారీరక శ్రమ మరీ అతిగా చేయడం, ఒత్తిడి, ఆందోళన అధికంగా ఉండడం, తీవ్ర భావోద్వేగాలకు తరచూ గురి కావడం, నీటిని సరిగ్గా తాగకపోవడం వంటివి అలసట వచ్చేందుకు కారణం అవుతున్నాయి. అలాగే టీ, కాఫీలన అతిగా తాగేవారికి, మద్యం అధికంగా సేవించే వారికి కూడా అలసట వస్తుంటుంది. అలసట ఉన్నవారు శరరీంలో శక్తి లేనట్లు ఫీలవుతారు. ఉదయం నిద్రలేవగానే తీవ్రమైన అలసటగా అనిపిస్తుంది. చిన్న పనిచేసినా తీవ్రంగా నీరసం వస్తుంది. అయితే అలసట అనేది పెద్ద సమస్య కాదు. ఆయా విషయాల్లో మార్పులు చేసుకోవడంతోపాటు తినే ఆహారం విషయంలోనూ జాగ్రత్తలను పాటిస్తే అలసటను సులభంగా తగ్గించుకోవచ్చు.
అలసట సమస్య ఉన్నవారు వేళకు నిద్రించే ప్రయత్నం చేయాలి. వేళకు భోజనం చేయాలి. జంక్ ఫుడ్ తీసుకోకూడదు. పోషకాలు ఉన్న ఆహారాలనే తినాలి. వ్యాయామం శరీరానికి ఎంత అవసరమో అంతే చేయాలి. శారీరక శ్రమ చేసేవారు నిరంతరాయంగా చేయకూడదు. మధ్య మధ్యలో విశ్రాంతి తీసుకోవాలి. టీ, కాఫీలను అతిగా సేవించకూడదు. మద్యం తాగడం మానేయాలి. పొగ తాగకూడదు. ఒత్తిడి, ఆందోళనను తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. అందుకు గాను యోగా, ధ్యానం దోహదం చేస్తాయి. ఈ విధంగా పలు సూచనలు పాటిస్తే అలసట చాలా వరకు దూరం అవుతుంది. ఇక ఆహారం విషయంలోనూ అనేక మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా పలు ఆహారాలను రోజూ తీసుకోవడం వల్ల శరీరంలో శక్తి స్థాయిలు పెరిగి అలసట తగ్గుతుంది. అలసట ఉన్నవారు ఓట్స్, కినోవా, బ్రౌన్ రైస్‌ను తింటే ఫలితం ఉంటుంది. వీటిల్లో ఉండే సంక్లిష్టమైన పిండి పదార్థాలు రక్తంలో నెమ్మదిగా గ్లూకోజ్‌గా మారుతాయి. దీని వల్ల శరీరానికి నిరంతరం శక్తి లభిస్తూనే ఉంటుంది. దీంతో యాక్టివ్‌గా ఉంటారు. ఉత్సాహంగా పనిచేస్తారు. అలసట తగ్గిపోతుంది.
అలసట ఉన్నవారు చిలగడదుంపలు, ఆలుగడ్డలు, పప్పు దినుసులు, బీన్స్ వంటి ఆహారాలను తింటుంటే ఉపయోగం ఉంటుంది. చికెన్, మటన్‌ను కూడా తినవచ్చు. కోడిగుడ్లను రోజువారి ఆహారంలో భాగం చేసుకోవాల్సి ఉంటుంది. రోజుకు ఒక కోడిగుడ్డును ఉడకబెట్టి తినాలి. కొవ్వు తీసిన పాలు, పెరుగు తీసుకోవాల్సి ఉంటుంది. నెయ్యి, పనీర్ కూడా మేలు చేస్తాయి. సోయా పాలను కూడా తాగవచ్చు. సోయా టోఫు, పీనట్ బటర్‌ను తింటున్నా ఉపయోగం ఉంటుంది. ఇక ఐరన్ లోపం వల్ల కూడా అలసట తరచూ వస్తుంది. కనుక శరీరానికి ఐరన్ లభించేలా చూసుకోవాలి. ఐరన్ ఉండే ఆహారాలను రోజూ తినాల్సి ఉంటుంది. ఐరన్ మనకు పాలకూర, మటన్, రొయ్యలు, చేపలు, పప్పు దినుసులు, గుమ్మడి విత్తనాలు, తృణ ధాన్యాల్లో లభిస్తుంది. వీటిని తినడం వల్ల ఐరన్ లభించి అలసట, నీరసం తగ్గిపోతాయి. యాక్టివ్‌గా మారుతారు.
విటమిన్ సి అధికంగా ఉండే ఆహారాలను తింటున్నా కూడా ఉపయోగం ఉంటుంది. క్యాప్సికం, సిట్రస్ ఫలాలు, స్ట్రా బెర్రీలను తింటే విటమిన్ సి లభిస్తుంది. ఇది మన శరీరాన్ని యాక్టివ్‌గా మార్చి ఉత్సాహంగా ఉండేలా చేస్తుంది. అలసటను తగ్గిస్తుంది. శరీరంలో విటమిన్ బి12 లోపం ఉన్నా కూడా నీరసంగా, అలసటగా ఉంటుంది. కనుక విటమిన్ బి12 లభించేలా చూసుకోవాలి. ఈ విటమిన్ ఎక్కువగా మటన్, చేపలు, కోడిగుడ్లు, పాల ఉత్పత్తులు, పుట్ట గొడుగుల్లో లభిస్తుంది. కనుక వీటిని తింటుంటే ఉపయోగం ఉంటుంది. అలాగే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు అధికంగా ఉండే అవకాడోలు, బాదంపప్పు, వాల్ నట్స్, చియా విత్తనాలు, అవిసె గింజలను తింటుండాలి. ఇవన్నీ అలసటను తగ్గించి శరీరానికి శక్తిని అందిస్తాయి. దీంతో యాక్టివ్‌గా మారుతారు. శరీరంలో శక్తి స్థాయిలు పెరుగుతాయి. నీరసం తగ్గుతుంది. ఇలా ఆయా ఆహారాలను తీసుకుంటుంటే అలసటను సులభంగా దూరం చేసుకోవచ్చు.