Jagadish Reddy | హైదరాబాద్ : జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలను చూస్తుంటే ఆశ్చర్యమేస్తుందని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి పేర్కొన్నారు. ఈ ఉప ఎన్నిక కోసం మా పీజేఆర్ అంటున్నడు.. అసలు పీజేఆర్‌ను చంపిందే కాంగ్రెస్ పార్టీ కదా అని జగదీశ్ రెడ్డి అన్నారు. తెలంగాణ భవన్లో జగదీశ్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
ఇవాళ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన మీట్ ది ప్రెస్‌లో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. రూ. 3 వేల కోట్లతో ఉస్మానియా, 100 ఎకరాల్లో హైకోర్టు కట్టిన అని చెప్పిండు. రుణమాఫీ చేశాను. ఆర్టీసీకి రూ. 700 కోట్ల లాభాలు తెచ్చానని సీఎం చెప్పిండు. చెప్పల్నా.. చెప్పొద్దా.. మట్లాడాల్నా.. మాట్లాడొద్దా.. అనే సోయి లేకుండా రేవంత్ రెడ్డి మాట్లాడిండు. 20 వేల నోటిఫికేషన్లు ఇచ్చి 60 వేల ఉద్యోగాలు ఇచ్చిండంట. ఒక్కటంటే ఒక్క నోటిఫికేషన్ రాలేదని నిరుద్యోగులు ధర్నాలు చేస్తే కేసులు పెట్టారు. జైళ్ల పాలు చేశారు. నామినేషన్లు వేసి కాంగ్రెస్ పార్టీని ఓడించండి అని జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో నిరుద్యోగులు ప్రచారం చేస్తున్నారు అని జగదీశ్ రెడ్డి తెలిపారు.
ఈ కమాండ్ కంట్రోల్, కాళేశ్వరం కడితే ఉద్యోగాలు వచ్చాయా అంటుండు రేవంత్ రెడ్డి. నీ నౌకరే అందులో చేస్తున్నవ్ కదా.. ఇవి కడితే నౌకర్లు రాలేదు అనుకుందాం.. 20 వేల నోటిఫికేషన్లలో 60 వేల ఉద్యోగాలు ఏం కడితే ఇచ్చినవ్. ఏమన్న కడితేనే ఉద్యోగాలు వస్తాయా..? సోయి లేకుండా మాట్లాడుతున్నాడు అని జగదీశ్ రెడ్డి మండిపడ్డారు.
మా చంద్రబాబు, మా వైఎస్సార్ అని ఆశ్చర్యంగా మాట్లాడుతున్నారు. ఈ ఎన్నిక కోసం మా పీజేఆర్ అంటున్నడు. పీజేఆర్‌ను చంపిందే కాంగ్రెస్ పార్టీ. పీజేఆర్ కుటుంబానికి రాజకీయాల్లో స్థానం లేకుండా చేసింది నువ్వు. ఇంత ప్రేమ ఉంటే సీటు ఎందుకు ఇవ్వలేదు అని రేవంత్ రెడ్డిని జగదీశ్ రెడ్డి నిలదీశారు.