Leopard | హైదరాబాద్ : కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్(టీ) మండల పరిధిలోని ఇటుకల్పహాడ్ గ్రామ శివార్లలో ఓ చిరుత పులి సంచారం చేస్తోంది. ఆదివారం ఉదయం కూలీలు పత్తి ఏరేందుకు వెళ్లగా.. వారి కంట చిరుత పడింది. దీంతో తీవ్ర ఆందోళనకు గురైన కూలీలు తిరిగి గ్రామానికి వచ్చారు. పత్తి ఏరుతుండగా పులి వచ్చి తమపై దాడి చేస్తుందేమోనన్న భయంతో కూలీలు వెనుదిరిగారు.
చిరుత సంచారంపై అటవీశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. తడోబా అంధేరి టైగర్ రిజర్వ్ నుంచి చిరుత తెలంగాణలోకి ప్రవేశించి ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. చిరుత సంచారం నేపథ్యంలో గ్రామస్తులు, పశువుల కాపర్లు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. మేత కోసం పశువులను అడవిలోకి తీసుకెళ్లొద్దని, పత్తి ఏరే క్రమంలో కూలీలు అల్లరి చేస్తూ అప్రమత్తంగా ఉండాలన్నారు. కూలీల అరుపులకు చిరుత పారిపోయే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.