రామవరం, మే 21 : కాళేశ్వరం సరస్వతి పుష్కర స్నానాలు చేసి తిరిగి వెళ్తున్న తల్లీ కొడుకు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. ఈ విషాద సంఘటన చంచుపల్లి మండలం పెనగడప పంచాయతీ పరిధిలోని చండ్రుకుంట బైపాస్ రోడ్డు వద్ద మంగళవారం అర్థరాత్రి జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం చిరుతపూడి గ్రామానికి చెందిన మామిడిశెట్టి వెంకటపతి కుటుంబ సభ్యులతో కలిసి ఈ నెల 19న కాళేశ్వరంలో జరుగుతున్నటువంటి సరస్వతి పుష్కరాలకు వెళ్లి స్నానాలు ఆచరించారు. తిరిగి మంగళవారం రాత్రి భద్రాచలం సీతారామచంద్ర స్వామివారిని దర్శించుకున్నారు. అక్కడి నుంచి తిరువూరులోని వారి బంధువుల ఇంటికి వెళ్తున్న క్రమంలో చండ్రుకుంట బైపాస్ రోడ్డు వద్ద వారు వెళ్తున్న కారును సత్తుపల్లి జేవీఆర్ ఓసీ నుంచి ఆర్సీహెర్సీకి బొగ్గు లోడుతో వెళ్తున్న టిప్పర్ లారీ ఎదురుగా వచ్చి ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో మామిడిశెట్టి కనకదుర్గ (54) అక్కడికక్కడే మృతి చెందింది. కారు నడుపుతున్న కుమారుడు వెంకటరత్నం (36) ముందు భాగంలో ఇరుక్కుపోవడంతో సుమారు రెంగు గంటల పాటు పోలీసులు, లారీ డ్రైవర్లు శ్రమించి బయటికి తీశారు. రెండు కాళ్లు పూర్తిగా నుజ్జునుజ్జు కావడంతో వెంటనే కొత్తగూడెం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం విజయవాడకు తరలిస్తుండగా కొత్తగూడెం పోస్టాఫీస్ సెంటర్ దాటేసరికి మృతి చెందినట్లు తెలిపారు. అదే కారులో ఉన్న బంధువుల అమ్మాయి దీక్షిత తలకు తీవ్ర గాయమైంది. ఆమెను ఖమ్మంకు తరలించారు. ఆమె పరిస్థితి సైతం విషమంగా ఉంది. కుటుంబ పెద్ద మామిడిశెట్టి వెంకటపతి, కోడలు జ్యోతి స్వరూప, మనవడు చేతన శిరీషకు గాయాలయ్యాయి. ఈ ప్రమాదంపై టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు.
సత్తుపల్లి జేవీఆర్, కిష్టారం ఓసీల నుంచి కొత్తగూడెం ఏరియా ఆర్ సి హెచ్ పి కి వస్తున్న బొగ్గు టిప్పర్లు అతివేగంగా వస్తుండటంతో ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. మంగళవారం ఒక్కరోజే ఎర్రగుంట ప్రాంతానికి చెందిన మౌలానా, కోనసీమ జిల్లాకు చెందిన మామిడిశెట్టి కనకదుర్గా, వెంకటరత్నం బొగ్గు టిప్పర్లు ఢీకొని చనిపోవడంతో ఈ ప్రాంత ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. మితిమీరిన వేగంతో బొగ్గు టిప్పర్లు నడపడమే ప్రధాన కారణమని, వీరిపై పోలీసు, రవాణా శాఖ అధికారుల పర్యవేక్షణ లోపం, నియంత్రణ లేకపోవడమే ప్రధాన కారణమన్నారు. గతంలో కూడా ఇలాంటి సంఘటనలెన్నో జరిగాయని, ఇప్పటికైనా అధికారులు స్పందించకపోతే ప్రజల ప్రాణాలు గాలిలో కలిసిపోతాయని ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. టిప్పర్ డ్రైవర్లకు అవగాహన కల్పించాలని కోరారు.