న్యూఢిల్లీ, నవంబర్ 3: సెక్యూరిటీస్ మార్కెట్లో మదుపరులను ప్రోత్సహించే దిశగా ముందుకెళ్తున్న సెబీ.. బుధవారం మరిన్ని నిర్ణయాలు తీసుకున్నది. సులభతర వ్యాపార నిర్వహణకు ఊతమిస్తూ ఆర్టీఏలు, రిజిస్ట్రార్ల ద్వారా వచ్చే ఇన్వెస్టర్ల సర్వీస్ విజ్ఞప్తుల ప్రాసెసింగ్ నిబంధనల్ని మరింత సరళతరం చేసింది. అలాగే పాన్, కేవైసీ వివరాల సమర్పణ, ఫిజికల్ సెక్యూరిటీ హోల్డర్ల నామినేషన్ విధివిధానాలనూ తీసుకొచ్చింది. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి ఇవి అమల్లోకి వస్తాయని ఓ సర్క్యులర్‌లో సెబీ తెలియజేసింది. దీంతో ఇకపై పాన్, నామినీ, సంతకం, కాంటాక్ట్, బ్యాం క్ వివరాల అప్డేషన్ లేదా మార్పులు వంటివి సులువు కానున్నాయి. వచ్చే మార్చి 31లోగా ఆధార్‌తో పాన్ అనుసంధానం మదుపరులకు తప్పనిసరి అని కూడా తెలిపింది. కాగా, డిజిటల్ గోల్డ్ వంటి నియంత్రణ లేని లావాదేవీలకు ట్రస్టీగా డిబెంచర్ ట్రస్టీలు ఉండరాదని ఈ సందర్భంగా సెబీ స్పష్టం చేసింది.