హైదరాబాద్, మార్చి 12 (నమస్తే తెలంగాణ): ఆరోగ్య తెలంగాణతోనే బంగారు తెలంగాణ సాధ్యమని సీఎం కేసీఆర్ విశ్వసిస్తారని, అందుకే బడ్జెట్లో వైద్యానికి అత్యధిక నిధులు కేటాయించారని ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ చెప్పారు. శనివారం అసెంబ్లీలో ఆరోగ్యశాఖ పద్దుపై చర్చలో ఆయన మాట్లాడుతూ.. పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు మన దగ్గర పథకాలు ఉన్నాయని అన్నారు. బిడ్డ కడుపులో ఉన్నప్పుడు పౌష్టికాహారం కోసం ఆరోగ్య లక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టారని, చివరకు చనిపోయినవారి పార్థివదేహాలను ఉచితంగా గ్రామాలకు తరలించేందుకు 36 మార్చురీ వ్యాన్లు ఏర్పాటుచేసిన ఘనత సీఎం కేసీఆర్‌దే అన్నారు. పుట్టకముందు నుంచి మరణానంతరం వరకు కూడా ప్రభుత్వ పథకాలు ఉన్నాయని చెప్పేందుకు గర్విస్తున్నట్టు తెలిపారు.