Mojtaba Khamenei : అమెరికా (USA) కు అనుభవమైన అవమానకర వైఫల్యంతో హర్మూజ్ జలసంధిలో సరికొత్త అధ్యాయం ప్రారంభమైందని ఇరాన్ సుప్రీం లీడర్ (Iran Supreme Leader) మొజ్తబా ఖమేనీ (Mojtaba Khamenei) అన్నారు. అమెరికా, ఇజ్రాయెల్ (US, Israel) దేశాలతో యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి పర్షియన్ గల్ఫ్ (Parcian Gulf), హర్మూజ్ జలసంధి (Strait of Hormuz) విషయాల్లో కొత్త అధ్యాయం రూపుదిద్దుకుంటోందని తెలిపారు. ఈ మేరకు ఆయన ఒక లిఖిత పూర్వక ప్రకటన విడుదల చేశారు.
హర్మూజ్ జలసంధిలో అమెరికా దిగ్బంధనం కొనసాగుతున్నప్పటికీ, ఇరాన్ తన అణు, క్షిపణి సామర్థ్యాలను పరిరక్షించుకుంటోందని సుప్రీం లీడర్ తెలిపారు. పర్షియన్ గల్ఫ్‌లో అమెరికన్ల ఏకైక స్థానం.. ఆ సముద్ర జలాల అడుగున మాత్రమే ఉంటుందని ఖమేనీ ఎద్దేవా చేశారు. కాగా, పశ్చిమాసియాలో ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే హర్మూజ్ జలసంధిలో కొత్త నియమ నిబంధనలను అమలుచేస్తారని తెలుస్తున్నది. ఈ నేపథ్యంలో మొజ్తాబా వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది.
అంతకుముందు ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ కూడా అమెరికాకు కౌంటర్ ఇచ్చారు. ఇరాన్ ఓడ రేవులపై అమెరికా దిగ్బంధనం గల్ఫ్‌లో చమురు అంతరాయాలను మరింత తీవ్రతరం చేస్తున్నదని అన్నారు. తద్వారా అమెరికా తన లక్ష్యాలను సాధించడంలో విఫలం కావడం తథ్యమని ప్రకటనలో పేర్కొన్నారు. సముద్ర దిగ్బంధం లేదా ఆంక్షల విధింపు అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధమని ఆయన వ్యాఖ్యానించారు.