Chilkuru Balaji Temple | మొయినాబాద్,ఫిబ్రవరి18: చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్‌పై దాడి చేసిన రామరాజ్యం వ్యవస్థాపకులు వీర రాఘవరెడ్డిని మొయినాబాద్ పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. కోర్టు అనుమతితో మంగళవారం ఉదయం వీరరాఘవ రెడ్డిని మొయినాబాద్ పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చారు. ఈ క్రమంలో సీఐ పవన్ కుమార్ రెడ్డి అతన్ని విచారిస్తున్నారు.
రంగరాజన్‌పై రామరాజ్యం ప్రచారకులు దాడి చేయడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. ఈ క్రమంలోనే పోలీసుల రిమాండ్ రిపోర్టులో వీరరాఘవరెడ్డికి సంబంధించిన అనేక అంశాలు వెలుగులోకి వచ్చాయి. తనకు తానే శివుడి అవతారం అని ప్రకటించుకుని.. రామరాజ్యం పేరిట రిక్రూట్మెంట్ ప్రారంభించినట్లుగా పోలీసులు గుర్తించారు. రామరాజ్యం పేరిట అనేక అక్రమాలకు వీరరాఘవ రెడ్డి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. “దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ”తోనే రామరాజ్యం సాధ్యమని తన అనుచరులను ప్రభావితం చేయడమే కాకుండా.. పూజారులపై భౌతిక దాడులు చేశారు. కాగా, వీర రాఘవ రెడ్డి గతంలోనూ అనేక అక్రమాలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. అతనిపై 2015, 2016లోనూ కేసులు నమోదయ్యాయి.