హైదరాబాద్, ఆట ప్రతినిధి: హైదరాబాద్‌లోని నాంపల్లి మల్లేపల్లికి చెందిన యువ స్పీడ్‌స్టర్ మహమ్మద్ మాలిక్..భారత అండర్-19 క్రికెట్ జట్టుకు ఎంపికయ్యాడు. ఈనెల 17 నుంచి బెంగళూరు వేదికగా మొదలయ్యే అండర్-19 ముక్కోణపు వన్డే సిరీస్‌కు ఎంపిక చేసిన భారత ‘ఏ’ జట్టులో మాలిక్ చోటు దక్కించుకున్నాడు. ఇటీవల జరిగిన వినూ మన్కడ్ టోర్నీలో హైదరాబాద్ టైటిల్ విజేతగా నిలువడంలో కీలకంగా వ్యవహరించాడు. తనదైన పేస్‌తో టోర్నీలో 10 వికెట్లు పడగొట్టి సత్తాచాటాడు. భారత జట్టుకు ఎంపికైన సందర్భంగా బుధవారం మ్యాగ్నెట్ ఇన్ఫ్రా సంస్థ కార్యాలయంలో సంబురాలు చేశారు.
టీమ్ఇండియా స్టార్ బౌలర్ సిరాజ్ స్ఫూర్తితో ముందుకెళుతున్నట్లు మాలిక్ పేర్కొన్నాడు. భవిష్యత్‌లో టీమ్ఇండియాకు ఆడాలన్నది తన కల అని చెప్పుకొచ్చాడు. తాను కూడా క్రికెటర్నేనని, జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం కలను కొడుకు ద్వారా సాకారం చేసుకున్నట్లు మాలిక్ తండ్రి అబ్దుల్ సుభాన్ పేర్కొన్నారు. ఇదిలా ఉంటే మాలిక్‌తో పాటు హైదరాబాద్ నుంచి ఇదే టోర్నీలో భారత్ ‘బీ’ జట్టుకు ఆరోన్ జార్జ్ కెప్టెన్‌గా వ్యవహరించనుండగా, వఫీ కచ్చి, అలంకృత్ ‘ఏ’ జట్టుకు ఎంపికయ్యారు.