హైదరాబాద్, మే 15 (నమస్తే తెలంగాణ) : పశ్చిమాసియా యుద్ధ సంక్షోభం, అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలను సాకుగా చూపి కేంద్రం ప్రజలపై పెట్రో బాంబు వేసింది. శుక్రవారం తెల్లవారకముందే పెట్రోల్, డీజిల్, సీఎన్జీ రేట్లు పెంచి షాక్ ఇచ్చింది. వివిధ రాష్ట్రాల్లో ఎన్నికలు ముగిసిన వెంటనే వాణిజ్య సిలిండర్ ధరను వెయ్యికి పైగా పెంచి మే డే కానుక ఇచ్చిన మోదీ ప్రభుత్వం.. కొత్త ముఖ్యమంత్రులు పాలనా పగ్గాలు చేపట్టకముందే పెట్రో భారాన్ని మోపారు. పెట్రో ధరల పెంపుతో హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్, నిజామాబాద్ జిల్లాల్లో కార్మికులు, కర్షకులు రోడ్డెక్కారు. ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్తో పాటు వామపక్ష పార్టీలు సీపీఐ, సీపీఎం నిరసనలకు దిగారు. ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగిసిన వెంటనే పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి కేంద్రం సామాన్యుడిని దొంగ దెబ్బతీసిందని బీఆర్ఎస్ రాష్ట్ర నేత గోసుల శ్రీనివాస్ ధ్వజమెత్తారు.
పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ వామపక్షాల ఆధ్వర్యంలో ఖమ్మం నగరంలో శుక్రవారం ఆందోళన చేపట్టారు. ఆటోకు తాళ్లు కట్టి లాగుతూ నిరసన తెలిపారు. ఇంధన ధరలు తగ్గించాలని సీపీఐ ఆధ్వర్యంలో శుక్రవారం హనుమకొండలోని కాళోజీ సెంటర్లో ఆటోలకు తాళ్లు కట్టి లాగుతూ నిరసన తెలిపారు. చమురు ధరల పెరుగుదలతో దేశవ్యాప్తంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదురొంటున్నారని సీపీఐ సీఈసీ సభ్యుడు డాక్టర్ కె.నారాయణ ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడం వలన సామాన్య ప్రజలపై కేంద్రప్రభుత్వం తీవ్ర భారం మోపుతున్నదని సీపీఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం విమర్శించారు.