హైదరాబాద్, నవంబర్ 2 (నమస్తే తెలంగాణ): ఉపరితల ఆవర్తనం విదర్భ దాని సమీపంలోని మరఠ్వాడ ప్రాంతంలో సగటు సముద్ర మట్టం నుంచి 0.9 కి.మీ ఎత్తులో ఏర్పడిందని, రాబోయే మూడ్రోజులు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మంగళవారం కొన్ని జిల్లాల్లో తేలికపాటి వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉన్నదని వెల్లడించింది.
రాబోయే 48 గంటలు రాష్ట్రవ్యాప్తంగా ఆకాశం మేఘావృతమై, కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని పేర్కొన్నది. ఉపరితల గాలులు ఉత్తర దిశ నుంచి గంటకు 6 నుంచి 10 కి.మీ వేగంతో వీచే అవకాశం ఉన్నదని వివరించింది. ఈనెల 4న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్టు వెల్లడించింది.