హైదరాబాద్, ఆగస్టు 3 (నమస్తే తెలంగాణ) : ఆగస్టులోనూ దేశవ్యాప్తంగా సాధారణం కంటే తక్కువ వర్షపాతమే నమోదవుతుందని శాటిలైట్ చిత్రాల ఆధారంగా వాతావరణ శాఖ వెల్లడించింది. పసిఫిక్ మహాసముద్రంపై మోస్తరు ఎల్ నినో కొనసాగుతుండటంతో నైరుతి రుతుపవనాలు ఎప్పుడైనా బలహీనపడే అవకాశమున్నదని అంచనా వేసింది. దీని ప్రభావంతో ఆగస్టులో సాధారణ వర్షపాతం కంటే 94 శాతం వరకు తక్కువగా నమోదు కావొచ్చని వాతావరణశాఖ అధికారులు పేర్కొన్నారు. ఆగస్టు నెల కూడా లోటు వర్షపాతంతోనే ప్రారంభమైంది. సోమవారం వరకు 10.3 మి.మీ వర్షపాతం నమోదైంది. జూలైలో 227.4 మి.మీ సగటు వర్షపాతం కురువాల్సి ఉండగా, 224 మి.మీ నమోదైనట్టు అధికారులు వెల్లడించారు.
సముద్రమట్టం వద్ద ఉన్న రుతుపవన ద్రోణి ప్రస్తుతం బికనీర్, ఢిల్లీ, లక్నో, పాట్నా మీదుగా మణిపూర్ వైపు కొనసాగుతూ సముద్రమట్టానికి 0.9 కి.మీ ఎత్తు వరకు విస్తరించి ఉన్నదని, ఇది ఉత్తర అంతర్గత కర్ణాటక నుంచి దక్షిణ అంతర్గత కర్ణాటక, కేరళ, తమిళనాడు మీదుగా కొమెరిన్ వరకు సముద్రమట్టానికి 5.8 కి.మీ ఎత్తులో ద్రోణి బలహీనపడిందని తెలిపారు. దీని ప్రభావంతో రాబోయే మూడు రోజులపాటు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని చెప్పారు.
సోమవారం ఆదిలాబాద్, కుమ్రం భీం, మంచిర్యాల, నిర్మల్, నల్లగొండ, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, ములుగు, భద్రాద్రికొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్ జిల్లాల్లో వర్షాలు కురిసినట్టు తెలిపారు. గడిచిన 24 గంటల్లో వికారాబాద్ జిల్లా కొడంగల్‌లో 10.43 సెం.మీ., కామారెడ్డి జిల్లా పిట్లంలో 10.38, సంగారెడ్డి సిర్గాపూర్‌లో 8.40, హైదరాబాద్ బండ్లగూడలో 7.78 సెం.మీ. వర్షపాతం నమోదైంది.