మహబూబాబాద్ రూరల్, మే 7 : ఓరుగల్లులో బీఆర్ఎస్ నిర్వహించిన రైతు సంగ్రామ సదస్సుతో కాంగ్రెస్ వెన్నులో వణుకు పుట్టిందని ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు అన్నారు. గురువారం ఆ యన మహబూబాబాద్‌లోని క్యాంప్ ఆఫీస్‌లో మీడియాతో మాట్లాడారు. రైతు సం గ్రామ సదస్సుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజర్ కావడంతో రైతులు స్వచ్ఛందంగా తరలివచ్చారని తెలిపారు. నాలుగేండ్ల క్రితం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇక్కడ మీటింగ్ పెట్టి అనేక హామీలు ఇచ్చారని, అధికారంలోకి వచ్చి రెండున్నరేండ్లు గడిచినా రైతు సమస్యలు తీర్చడంలేదని విమర్శించారు.
రాష్ట్రంలో ఎక్కడ మార్కెట్ యార్డ్‌ను చూసినా మక్కలు కాంటా కాక రైతులు పడిగాపులు కాస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ పాలనలో మిషన్ కాకతీయ ద్వారా చెరువులు పూడికతీత, రైతుబంధు, రైతుబీమా, రుణ మాఫీ, పండించిన ప్రతి గింజకూ మద్దతు ధర కల్పించడం, రెండు పంటలకు పుష్కలంగా సాగునీరు ఇచ్చి వ్యవసాయంలో విప్లవాత్మక మార్పు తెచ్చిందని తెలిపారు. కాంగ్రెస్ రెండు లక్షల రుణమాఫీ అమలు చేయలేకపోయిందని విమర్శించారు.