హైదరాబాద్, జనవరి 3 (నమస్తే తెలంగాణ): రైతులను కించపరిస్తే ఊరుకోబోమని రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి హెచ్చరించారు. రైతులు బాగుపడుతుంటే చూసి ఓర్వలేని బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, ఆ పార్టీ నేతలు శిఖండిలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. రైతుబంధుతో రైతులు సోమరిపోతులు అవుతారని, తాగి తందనాలు ఆడుతారని కొందరు వెకిలిగా మాట్లాడటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు చెప్పారు. రాష్ట్ర రైతాంగం బాగుపడటం బీజేపీకి కండ్లమంటగా మారిందని మండిపడ్డారు. సోమవారం తెలంగాణభవన్‌లో టీఆర్ఎస్ నేతలు మాదిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, లింగంపల్లి కిషన్‌రావు, రూప్‌సింగ్‌తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు.
పీఎం కిసాన్ యోజన అమలుచేస్తున్న కేంద్రం కూడా సోమరిపోతులను చేస్తున్నదా? అని పల్లా ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వ పథకాలను ఓర్వలేక ఆంధ్రా సంఘాలు, ఆంధ్రా పత్రికలు కొంతకాలంగా అసత్యాలు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. ఆంధ్రా నాయకుడి వ్యాపార సంస్థ రైతు స్వరాజ్య వేదిక చెప్తున్న అసత్యాలను వార్తలుగా రాస్తూ, గందరగోళానికి గురిచేస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రా నాయకులు ఇచ్చే సమాచారంతో వార్తలు ప్రచురించకూడదని, తెలంగాణపై విష ప్రచారాలను సహించబోమని, చట్టరీత్యా చర్యలు తీసుకొంటామని హెచ్చరించారు.
ఎన్సీఆర్బీ శాస్త్రీయ లెక్కల కన్నా, రైతు స్వరాజ్య వేదిక అంచనాలు ఆంధ్రా మీడియాకు గొప్పగా కనిపిస్తున్నాయని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో 2014 నుంచి 2020 వరకు రైతు ఆత్మహత్యలు తగ్గిపోయినట్టు ఎన్సీఆర్బీ రికార్డులు వెల్లడించిన విషయం వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. మద్యం ద్వారా అత్యధిక ఆదాయం పొందుతున్న రాష్ర్టాల్లో మొదటి ఆరు స్థానాల్లో బీజేపీ రాష్ర్టాలే ఉన్నాయని, తెలంగాణ 11వ స్థానంలో ఉన్నదని గుర్తుచేశారు.
సంబురంగా రైతుబంధు ఉత్సవాలు
దేశ చరిత్రలో రైతుల ఖాతాల్లోకి నేరుగా రూ.50 వేల కోట్లు వేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందని, అందుకే రైతు వారోత్సవాలు నిర్వహిస్తున్నట్టు పల్లా రాజేశ్వర్‌రెడ్డి వివరించారు. రైతు సంబురాలు కొన్ని పార్టీలకు ఇబ్బందిగా మారాయని ధ్వజమెత్తారు. రైతుబంధు లబ్ధిదారుల కుటుంబాల్లోని 8 నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు వక్తృత్వం, వ్యాసరచన, చిత్రలేఖనం, ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నామని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం గత వానకాలంలో 48 లక్షల మెట్రిక్‌టన్నులు కొనుగోలు చేయగా, ఈ సీజన్లో ఇప్పటికే 65 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లను కొనుగోలు చేసినట్టు వివరించారు. కేంద్రంతో కొట్లాడి ధాన్యం కొనుగోళ్లకు అనుమతి తీసుకొచ్చామని, రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఒత్తిడికి కేంద్రం తలొగ్గిందని చెప్పారు.