హైదరాబాద్, నవంబర్ 11 (నమస్తే తెలంగాణ): బీజేపీ నేతలకు దమ్ముంటే యాసంగి వడ్ల కొనుగోళ్ల కోసం ఢిల్లీలో ధర్నా చేయాలని రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి సవాల్ చేశారు. బండి సంజయ్‌కు చిత్తశుద్ధి ఉంటే ఎఫ్‌సీఐ ద్వారా కొనుగోలు చేస్తామని కేంద్రం నుంచి లేఖ తేవాలని డిమాండ్ చేశారు. గురువారం ఆయన తెలంగాణభవన్‌లో పౌరసరఫరాల సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఎం శ్రీనివాస్‌రెడ్డి, కార్యదర్శులు సోమ భరత్, తాతా మధుతో కలిసి మీడియాతో మాట్లాడారు.
ఒకవైపు రాష్ట్రం లో ధాన్యం కొనుగోళ్లు కొనసాగుతుంటే, వానకాలం పంట కొనుగోలు చేయాలని బీజేపీ నాయకులు కలెక్టరేట్ల వద్ద ధర్నాలు చేయడం వారి అజ్ఞానానికి పరాకాష్ట అని ఎద్దేవా చేశారు. తాము యాసంగి కొనుగోళ్లపై కేంద్రాన్ని నిలదీస్తుంటే, ప్రజల దృష్టిని మళ్లించేందుకు కలెక్టరేట్ల వద్ద యాగీ చేస్తున్నారని మండిపడ్డారు. వ్యవసాయం మీద, పంటల మీద కనీస అవగాహన లేని వ్యక్తి బీజేపీ అధ్యక్షుడు కావటం దురదృష్టకరమన్నారు.
వానకాలం ధాన్యం కొనుగోళ్ల విషయం లో రైతులు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పల్లా రాజేశ్వర్‌రెడ్డి భరోసా ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం 6,663 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేసిందని, ఇప్పటికే 3,550 కొనుగోలు కేంద్రాల్లో 5,11, 334 టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామని వెల్లడించారు. ఇందుకు సంబంధించి రూ. 1,000 కోట్లను రైతులకు చెల్లించామని తెలిపారు. గత ఏడేండ్లుగా రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా కొనుగోళ్లు నిర్వహించిందని గుర్తుచేశారు.
2019- 20లో కోటి 19 లక్షల టన్నులు, గత ఏడాది కోటి 41 లక్షలకు పైగా టన్నుల ధాన్యాన్ని ఎఫ్‌సీఐ ద్వారా రాష్ట్రం కేంద్రానికి ఇచ్చిందని వివరించారు. అయితే ఈసారి కేంద్రం.. పంటల విధానాన్ని మార్చుకోవాలని ఎఫ్‌సీఐ ద్వారా లేఖ రాసిందని వివరించారు. తాము చెప్తున్న లెక్కలు తప్పయితే ముక్కు నేలకు రాయడానికైనా సిద్ధమేనని, వానకాలం పంట విషయంలో బీజేపీ వాదన తప్పని తేలితే ఆ పార్టీ నేతలు ఏం చేస్తారో చెప్పాలని సవాల్ విసిరారు. బీజేపీ నేతలకు రాష్ట్రం మీద ప్రేమలేదని, రాజకీయం చేయటం, అసత్యాలు ప్రచారం చేయటమే వారి విధానమని ఆగ్రహం వ్యక్తంచేశారు..
యాసంగిలో మా రైతులు పండించిన వడ్లు కొంటారా? కొనరా? అని సీఎం కేసీఆర్ కేంద్రాన్ని అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పకుండా రాజకీయ పబ్బం, అసత్యాల ప్రచారం కోసం బీజేపీ నేతలు నానా యాగీ చేస్తున్నారని పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పండించిన ధాన్యం అమ్ముకోవడానికి దేశ రైతాంగం అంతా మండీ (మార్కెట్)లకు వెళ్తుంటే, మండీలే రైతుల కల్లాల దగ్గరకు వచ్చేలా చేసిన గొప్ప నాయకుడు సీఎం కేసీఆర్ అని చెప్పారు.
రాష్ట్రంలో 62 లక్షల ఎకరాల్లో వరి ఎలా పండుద్దని కేంద్ర మంత్రులు బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. పంట విస్తీర్ణాన్ని నిరూపించేందుకు సిద్ధంగా ఉన్నామని, ఆరు హెలికాప్టర్లలో వెళ్లి పరీక్షిద్దామని సీఎం కేసీఆర్ సవాల్ విసిరిన విషయాన్ని గుర్తుచేశారు. రాష్ట్రంలో ఎక్కడ ఏ పంట పండుతుంది? ఎంత ఉత్పత్తి అవుతుందనే అంచనాలను కేంద్రం టెస్టింగ్ పాయింట్ల ద్వారా పరిశీలించవచ్చని వివరించారు.
యాసంగి వడ్ల కొనుగోళ్లపై కేంద్రం స్ప ష్టమైన నిర్ణయం ప్రకటించాలని శుక్రవా రం అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో, కలెక్టర్ల అనుమతితో ధర్నా చేస్తున్నామని పల్లా రా జేశ్వర్‌రెడ్డి చెప్పారు. ధర్నాల్లో స్థానిక ఎమ్మెల్యేలు, జిల్లా మంత్రులు, పార్టీ శ్రేణులు, పెద్ద ఎత్తున రైతులు పాల్గొంటారని తెలిపారు. శుక్రవారం ధర్నాలో సీఎం కేసీఆర్ పాల్గొనాల్సిన అవసరం లేదని, ధర్నా చేయాల్సి వస్తే ఢిల్లీలో నిర్వహించే కార్యక్రమంలో పాల్గొంటారని చెప్పారు. ధర్నాచౌక్‌ను తాము ఎత్తివేయలేదని, స్థానికుల ఫి ర్యాదు వల్ల కోర్టు ఆపిందని, తిరిగి 2018 -19లో కోర్టు అనుమతి ఇవ్వడంతో అప్పటినుంచి అక్కడ కార్యక్రమాలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.