హైదరాబాద్, జనవరి 6 (నమస్తే తెలంగాణ) : తెలంగాణలో సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలో అరాచక, అప్రజాస్వామిక పాలన సాగుతున్నదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్‌కుమార్ విమర్శించారు. రాష్ట్రంలో నైతిక, రాజ్యాంగ విలువలు సంక్షోభంలో పడ్డాయని తెలిపారు. చిన్నారుల ముందే సీఎం రేవంత్‌రెడ్డి అడ్డగోలుగా బూతులు మాట్లాడుతూ సభ్యసమాజం తలదించుకునేలా చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీకి మంగళవారం శ్రవణ్‌కుమార్ ఘాటు లేఖ రాశారు.
89 క్రిమినల్ కేసులు ఉండి, కోర్టుల ద్వారా నిరంతర నేరస్తుడిగా ముద్రపడిన రేవంత్‌రెడ్డిని మీరు ముఖ్యమంత్రిగా నియమించడం వల్ల గల్లీ భాష మాట్లాడుతూ వ్యవస్థలను భ్రష్టుపట్టిస్తున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. ‘ఢిల్లీలో రాజ్యాంగాన్ని పట్టుకుని మొహబ్బత్ కీ దుకాణ్ (ప్రేమ దుకాణం) అని మాట్లాడే మీకు తెలంగాణలో రేవంత్‌రెడ్డి తెరిచిన బూతుల కబేళా కనిపిస్తలేదా?’ అని ప్రశ్నించారు. తక్షణమే రేవంత్‌రెడ్డిని నియంత్రించి, ప్రజాస్వామ్య విలువలను, గౌరవాన్ని రాష్ట్రంలో పునరుద్ధరించాలని ఆ లేఖలో విన్నవించారు.
ప్రజాస్వామ్య ఆలయమైన అసెంబ్లీ సాక్షిగా, ప్రతిపక్ష నాయకులను బడవ అని అత్యంత హేయంగా సంబోధించి రేవంత్‌రెడ్డి రాజ్యాంగ నైతికతపై దాడి చేశారని దాసోజు శ్రవణ్‌కుమార్ ఆందోళన వ్యక్తంచేశారు. ఇది కేవలం ఒక పదం కాదని, తెలంగాణ సమాజంపై జరిగిన దాడిగా ఆయన అభివర్ణించారు. సీఎం హోదాలో ఉండి నాలుక కోస్తా, తోలు తీస్తా, పేగులు మెడలో వేసుకుంటా.. అని కుసంస్కార భాష మాట్లాడుతున్నారని విమర్శించారు. సర్పంచులను, రాజకీయ ప్రత్యర్థులను సీఎం బెదిరిస్తూ అరాచక పాలనకు తెరతీశారని పేర్కొన్నారు. పాలనలో సంసారం పోయి, గల్లీ రౌడీల భాష రాజ్యమేలుతున్నదని ఆందోళన వ్యక్తంచేశారు. చిన్నారుల ముందే మాజీ ముఖ్యమంత్రిపై అత్యంత అసభ్య పదజాలంతో విరుచుకుపడటం ద్వారా, రేవంత్‌రెడ్డి భావితరాలకు ఏం సందేశం ఇస్తున్నారు? అని ప్రశ్నించారు. భావి తరాల భవిష్యత్తుపై ఇది ప్రతికూల ప్రభావం చూపదా? ఇది తెలంగాణ సంస్కృతిని కలుషితం చేయదా? అని పేర్కొన్నారు. రేవంత్‌రెడ్డి అరాచక ప్రవర్తనపై రాహుల్‌గాంధీ మౌనం వహించడం అంటే, ఆయన చేస్తున్న పాపాల్లో భాగస్వామ్యం ఉన్నట్టేనని ఆరోపించారు. ‘తక్షణమే రేవంత్‌రెడ్డిని నియంత్రించి, తెలంగాణలో ప్రజాస్వామ్య గౌరవాన్ని పునరుద్ధరించాలి’ అని డిమాండ్ చేశారు. లేఖ ప్రతిని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు కూడా పంపించారు.