కరీంనగర్, నవంబర్ 26 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : పెద్దపల్లి, కరీంనగర్ జిల్లా తనుగుల సరిహద్దులోని మానేరుపై నిర్మించిన చెక్‌డ్యాం పేల్చివేతపై రాజకీయ దుమా రం రేగుతున్నది. బీఆర్ఎస్ ఈ విషయాన్ని బట్టబయలు చేస్తుండగా, కాంగ్రెస్ కప్పిపుచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నదన్న విమర్శలువస్తున్నాయి. ఈ నేపథ్యంలో బుధవారం పెద్దపల్లి కాంగ్రెస్ ఎమ్మెల్యే విజయరమణారావు, హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి మధ్య సవాళ్లు.. ప్రతిసవాళ్లు కొనసాగాయి.
విజయరమణారావు కొంత మంది కాంగ్రెస్ నాయకులతో కలిసి కరీంనగర్‌లోని ఆర్అండ్బీ అతిథి గృహంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. చెక్‌డ్యాం పేల్చివేసినట్టు మాజీ మంత్రి హరీశ్‌రావు చె బుతున్నారని, పేల్చివేసినట్టు నిరూపిస్తే తా ను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతోపాటు రాజకీయాల నుంచి శాశ్వతంగా త ప్పుకుంటానని సవాల్ విసిరారు. దీనికి ఎమ్మెల్యే పాడికౌశిక్‌రెడ్డి హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్ పెట్టి ప్రతి సవాల్ విసిరా రు. ‘బ్లాస్టింగ్ చేసినట్టు చూపిస్తే రాజకీయాల్లో నుంచి తప్పుకుంటామని పెద్దపల్లి ఎమ్మెల్యే చెప్పారు.
ఆయన వెంటనే రాజకీయాల్లో నుంచి వైదొలగాలి. బ్లాస్టింగ్ చేసిన వాస్తవాలు మీడియా సాక్షిగా చూపిస్తున్న. విజయరమణారావుకు రాజకీయాల్లో నుంచి తప్పుకునే ధైర్యం ఉన్నదా..? లేదంటే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాదిరిగా మాట తప్పుతారా..?’ అంటూ ప్రశ్నించారు. ఈ సందర్భంగా చెక్‌డ్యాంకు జిలెటిన్‌స్టిక్స్ అమర్చిన తీరు, అందుకు సంబంధించిన వైరుతో కూడి ఉన్న వీడియోను మీడియాకు చూపించారు. ‘ఈ చెక్ డ్యాంపై 5 వేల నుంచి 6 వేల ఎకరాల సాగు ఆధారపడి ఉన్నది. నిజానికి పెద్దపల్లి ఎమ్మెల్యే అంటే ఇప్పటి వరకు కొంచెం గౌరవం ఉండేది.
ఇప్పుడది కూడా పోయింది’ అని ఎద్దేవా చేశారు. ‘హరీశ్‌రావు వల్లనే చెక్‌డ్యాం కుప్ప కూలిపోయిందని వివేక్ వెంకటస్వా మి అంటున్నరు. ఆ సమయంలో హరీశ్‌రావు ఇరిగేషన్ మంత్రిగా లేరన్న విషయం వివేక్‌కు తెలియకపోవచ్చు. బ్లాస్టింగ్ జరిగిందని నేను చెప్పడం లేదు. స్వయంగా ఇరిగేషన్ శాఖ డిప్యూటీ ఈఈ బ్లాస్టింగ్ జరిగినట్టు ఫిర్యాదు చేశారు’ అని చెప్పారు. ఆ ప్రాం తంలో జిలెటిన్‌స్టిక్స్ పెట్టి బ్లాస్టింగ్‌లకు పాల్పడడం కామన్ అయిపోయిందని ఆరోపించారు.
గతంలో హుస్సేన్‌మియా వాగుపై చెక్‌డ్యాంను పేల్చివేసేందుకు జరిగిన కుట్రలను గుర్తు చేశారు. ఈ విషయంలో రైతులు ఫిర్యాదు చేస్తే ఏం చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు. ఫిర్యాదులో కాంగ్రెస్ నాయకుల పేర్లు ఉన్నవి వాస్తవం కాదా..? అని చెప్పాలన్నారు. నిజానికి తనుగుల చెక్‌డ్యాంను రాఘవ కన్స్ట్రక్షన్ కంపెనీ నిర్మించిందని, నాణ్యత లోపించనట్టు భావిస్తే సదరు కంపెనీని బ్లాక్ లిస్ట్‌లో పెట్టాలని డిమాండ్ చేశారు.