సంగారెడ్డి : రాష్ట్ర ప్రభుత్వం ప్యారా నగర్లో 150 ఎకరాల్లో ఎర్పాటు చేయనున్న డంప్ యార్డుని(Dump yard) వ్యతిరేకిస్తున్నాం. డంప్ యార్డ్‌తో అక్కడ అడవి మొత్తం కాలుష్యం అవుతుందని ఎమ్మెల్యే సునీత లక్ష్మా రెడ్డి (MLA Sunitha laxma Reddy)అన్నారు. డంప్ యార్డ్‌కు వ్యతిరేకంగా కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. నల్లవల్లి, వ్యారానగర్ ప్రాంతంలో మంచి పంటలు పండే భూములు ఉన్నాయి. పోలీసుల పహారాలో డంప్ యార్డ్ నిర్మాణం చేస్తున్నారని మండిపడ్డారు. మరో లగచర్ల మాదిరిగా ఇక్కడ పోలీసుల ఒత్తిళ్లు ఉన్నాయి.
పచ్చటి అటవీ ప్రాంతాన్ని నాశనం చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం పూనుకుందని మండిపడ్డారు. నల్లగొండ జిల్లాలో ఫ్లోరైడ్ మాదిరిగా నల్లవల్లి ప్రాంత వాసులకు అనారోగ్య సమస్యలు వస్తాయి. కోర్టు నుంచి ఆదేశాలు ఉన్నా.. అధికారులు పట్టించుకోవడంలేదన్నారు. రాత్రికి రాత్రి పనులు చేస్తున్నారు. కోర్టు ఆర్డర్ ఉన్నా లెక్కచేయటం లేదన్నారు. అటవీ ప్రాంతంలో రాత్రి సమయాల్లో వందల సంఖ్యలో చెత్త లారీలు వస్తాయి. దానివల్ల ప్రమాదాలు జరుగుతాయి. 150 ఎకరాల్లో డంప్‌కి బదులుగా ఏదైనా పరిశ్రమ పెడితే మేము అభినందిస్తామన్నారు. నిరసన కార్యక్రమంలో అరెస్ట్ చేసిన రైతులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
రైతులను అరెస్ట్ చేయడమే ప్రజా ప్రభుత్వమా? అని నిలదీశారు. డంప్ యార్డుని వెంటనే ఆపాలి. రైతులకు ఉపయోగపడే కార్యక్రమాలు చేయాలన్నారు. రైతులకు మద్దతు ఇవ్వడానికి వెళ్తే నన్ను కూడా అరెస్ట్ చేశారు. పోలీస్ నిర్భందాల మధ్య యార్డ్ నిర్మాణం జరుగుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అటవీ అధికారులు యార్డ్ నిర్మాణానికి ఏ విధంగా అనుమతులు ఇచ్చారని ప్రశ్నించారు? రైతులకు రోడ్స్ వేస్తాం అంటే అనుమతులు ఇవ్వలేదు. డంప్ యార్డుకు ఏ విధంగా అనుమతులు ఇస్తారు. వెంటనే అనుమతులు రద్దు చేయాలని ఆమె డిమాండ్ చేశారు.