బడంగ్పేట్, ఏప్రిల్ 21: రాష్ట్రవ్యాప్తంగా మంచినీటి సమస్య జఠిలంగా మారినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితారెడ్డి ఆరోపించారు. జల్పల్లి, బడంగ్పేట్ సర్కిల్ కార్యాలయాల్లో మంగళవారం ఆమె వేరువేరుగా అధికకారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. జల్పల్లి అధికారులతో భేటీలో.. 99రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంతో ప్రజలకు ఒరిగిందేమీలేదన్నారు. బస్తీలలో నీటి సమస్య తీవ్రంగా ఉన్నట్లు ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయని ఆమె తెలిపారు. నీళ్లు సక్రమంగా సరఫరా చేయకపోగా నీటిబిల్లుల భారం మాత్రం తడిసి మోపెడు అవుతుందన్నారు. బోజగుట్ట రిజర్వాయర్ పనులను త్వరగా పూర్తిచేయాలన్నారు. తుక్కగూడ, జల్పల్లి విడదీసి నీటి సరఫరా చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎండబ్ల్యూ ఎస్ జనరల్ మెనేజర్ కిషోర్, కాజా జోహర్ అలీ, డిప్యూటీ కమీషనర్ వెంకట్రామ్, డీజీఏం యాదయ్య, శ్రీనివాస్, మహేశ్వర్ రావు తదితరులు పాల్గొన్నారు.
అధికారులు సమన్వయంతో పనిచేయాలి
బడంగ్పేట్ సర్కిల్ కార్యాలయంలో అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో సబిత ఫుట్‌పాత్‌ల కూల్చివేతలపై అధికారుల తీరును ఎండగట్టారు. శానిటేషన్ సమస్య జఠిలంగా మారుతున్నా ఎందుకు పట్టించుకోవడం లేదని అన్నారు. టెండర్లు పూర్తిచేసిన తర్వాత పనులు ఎందుకు చేయడం లేదని అధికారులను అడిగారు. అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేసి పెండింగ్ పనులు పూర్తిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఈ సమ్మయ్య, టౌన్ ప్లానింగ్ అధికారి కిరన్ కుమార్, ఏఈ హరీష్ తదితరులు ఉన్నారు.