బెంగళూరు, ఏప్రిల్ 21: పెండ్లి చేసుకోడన్నఅనుమానంతో కర్ణాటకలోని బెంగళూరులో ఒక యువతి పట్టపగలు ప్రియుడిపై ఘాతుకానికి దిగింది. ప్రేమ ప్రపోజల్ పేరుతో ప్రియుడి కండ్లకు గంతలు కట్టి, కుర్చీకి కట్టేసి అతడికి నిప్పంటించి హతమార్చింది. బెంగళూరులోని ఒక టెలికం స్టోర్‌లో పనిచేసే కిరణ్, ప్రేరణ ప్రేమించుకుంటున్నారు. వారిద్దరి వయసూ 27 ఏండ్లే. మంగళవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో అంజన్పురలోని తన ఇంటికి రావాలని కిరణ్‌ను ప్రేరణ ఆహ్వానించింది. కిరణ్ ఆమె ఇంటికి వెళ్లిన తర్వాత కాసేపు మాట్లాడుకున్నారు. అనంతరం ఆమె కిరణ్ కండ్లకు గంతలు కట్టడమే కాక, అతడిని కుర్చీకి కట్టేసింది. ఇదేంటని అభ్యంతరం చెబుతూ ప్రశ్నించిన అతడికి ఇదో కొత్తరకం ప్రపోజల్ అని, విదేశాల్లో అలాగే చెబుతారని అనడంతో నిజమే అనుకున్నాడు.
వెరైటీగా చేస్తున్న ఆమె ప్రపోజల్ కోసం కిరణ్ చూస్తుండగా, అతని ఒంటిపై ముందుగానే సిద్ధం చేసుకున్న మండే స్వభావం కల ద్రవాన్ని చల్లిన ఆమె తర్వాత అతని ఒంటికి నిప్పంటించింది. ఏం జరిగిందో తెలిసేలోగా మంటల్లో కిరణ్ ఆహుతై మరణించాడు. బాధతో అతను కేకలు వేస్తున్నా ఏమాత్రం చలించని ఆమె ఆ దృశ్యాన్ని తాపీగా సెల్ఫోన్లో రికార్డు చేసింది. కిరణ్ పెడుతున్న అరుపులు విని చుట్టుపక్కల వారు ఆ ఇంట్లోకి వచ్చి కుర్చీలో విగతజీవిగా పడి ఉన్న కిరణ్‌ని చూసి షాకయ్యారు.
మొదట అదేమన్నా ప్రమాదమేమోనని వారు భావించారు. అయితే అతడిని తానే హత్య చేసినట్టు ప్రేరణ నిర్భయంగా చెప్పింది. దీంతో వారు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. రంగప్రవేశం చేసిన పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి కిరణ్‌ను ఎందుకు చంపావని ప్రశ్నించగా, ‘సంవత్సరం నుంచి మేం రిలేషన్లో ఉన్నాం.. అతను ఈ మధ్య నన్ను సరిగ్గా పట్టించుకోవడం లేదు. నన్ను పెండి ్లచేసుకోడని అనుమానం వచ్చింది. అందుకే నిప్పు పెట్టి చంపేశా’ అని తాపీగా చెప్పడంతో విస్తుపోవడం పోలీసుల వంతయ్యింది. ఇంట్లో తల్లి, సోదరుడితో ప్రేరణ ఉంటున్నదని, ఘటన జరిగినప్పుడు వారు ఇంట్లో లేరని డిప్యూటీ పోలీస్ కమిషనర్ డీఎల్ నగేశ్ తెలిపారు.