మంచిర్యాల, ఆగస్టు 31 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యటన సందర్భంగా లుకలుకలు బయటపడ్డాయి. పెద్దపల్లి జిల్లాతోపాటు మంచిర్యాల జిల్లా చెన్నూర్ నియోజకవర్గంలో శనివారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్ పర్యటించాల్సి ఉండగా.. రామగుండంలో మంత్రుల పర్యటన ఆలస్యం కావడంతో చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఆయన కుమారుడు, పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ అసహనం వ్యక్తంచేసినట్టు సమాచారం. మంత్రుల పర్యటన సందర్భంగా చెన్నూర్ నియోజకవర్గంలో మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్ రావు భారీ ప్లెక్సీలు ఏర్పాటు చేయడంపై రామగుండంలో మంత్రుల ముందే వివేక్ ఆగ్రహం వ్యక్తంచేసినట్టు తెలిసింది. ఈ మేరకు రామగుండం సింగరేణి గెస్ట్‌హౌస్ నుంచి వివేక్ సహా ఎంపీ వంశీ అలిగి చెన్నూర్‌కు బయల్దేరి వచ్చారు. దీంతో డిప్యూటీ సీఎం చెన్నూర్ పర్యటనను అర్ధంతరంగా రద్దు చేసుకున్నారు.
మంత్రి పదవి కోసం ప్రేమ్‌సాగర్‌రావు, వివేక్ గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీలో ఈ ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య వర్గపోరు తీవ్రమైంది. అలిగి వచ్చిన ఎమ్మెల్యే వివేక్, ఎంపీ వంశీకృష్ణ చెన్నూర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ముఖ్య నాయకులతో సమావేశమయ్యారు. త్వరలో సీఎం రేవంత్‌రెడ్డిని చెన్నూర్ పర్యటనకు తీసుకువస్తానని, రాజకీయంగా ఇక నుంచి మరింత గట్టిగా ముందుకెళ్దామని వివేక్ సదరు నాయకులను భరోసా కల్పించారు. రామగుండం నుంచి వివేక్ వెళ్లిపోయాక కార్యకర్తలను ఉద్దేశించి మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. ఉమ్మడి ఆదిలాబాద్‌లో ప్రేమ్‌సాగర్‌రావు నాయకత్వంపై కాంగ్రెస్ అధిష్ఠానానికి, సీఎం రేవంత్‌రెడ్డికి పూర్తి నమ్మకం ఉన్నదని అన్నారు. పార్టీకి, కార్యకర్తలకు అండగా నిలిచిన ఆయనకు కీలక బాధ్యతలు రాబోతున్నాయని తెలిపారు. ఈ పరిణామంపై ఎమ్మెల్యే వివేక్ కుటుంబం ఎలా స్పందిస్తుందో చూడాలి.