హైదరాబాద్, డిసెంబర్ 15 (నమస్తే తెలంగాణ): టీపీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్ ఓ పప్పెట్ (ఆడించే బొమ్మ), డమ్మీ మాత్రమేనని బీఆర్ఎస్ నేత, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేవీ వివేకానంద విమర్శించారు. ముఖ్యమంత్రుల పనితీరు బాగాలేకపోతే గతంలో పీసీసీ అధ్యక్షులు బహిరంగంగానే చెప్పేవారని, సలహాలు, సూచనలు ఇచ్చేవారని గుర్తుచేశారు. మహేశ్‌గౌడ్ ఏదైనా లేఖ రాయాల్సివస్తే సీఎం రేవంత్ తప్పిదాలపైనా, ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, 420 హామీల అమలుపై రాయాలని హితవు పలికారు. కేసీఆర్‌కు పీసీసీ చీఫ్ బహిరంగ లేఖ రాయడంపై మండిపడ్డారు. రేవంత్‌రెడ్డికి రాసిన లేఖను కేసీఆర్‌కు పంపారనే అనుమానం కలుగుతున్నదని ఎద్దేవా చేశారు. తెలంగాణభవన్‌లో ఆదివారం మాజీ ఎమ్మెల్యే బాల సుమన్‌తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. పీసీసీ అధ్యక్షుడికి కూడా సీఎం రేవంత్‌రెడ్డి అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని, ఇలా కేసీఆర్‌కు లేఖ రాయడం వల్ల పట్టించుకుంటారేమోనని ఆశపడుతున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణ ఇవ్వలేదని, కేసీఆర్ నేతృత్వంలో సాధించామని ప్రజలు భావిస్తున్నారని, సోనియా తెలంగాణ ఇచ్చారని ప్రజలు నమ్మితే 2014, 2018లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేదని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఆత్మ బలిదానాలకు కారణం కాంగ్రెస్ నేతలేనని, రేవంత్‌రెడ్డి పేరు రాసి కూడా కొందరు బలిదానం చేసుకున్నారని గుర్తుచేశారు.
రేవంత్ తప్పిదాల కారణంగా కాంగ్రెస్ మరో ఇరవై ఏండ్లు అధికారానికి దూరమయ్యే పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు. పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చింది కేసీఆర్ అన్న విషయం మహేశ్ తెలుసుకోవాలని సూచించారు. ఆర్థిక రంగంపై అబద్ధాలు ప్రచారం చేస్తున్న పీసీసీ చీఫ్ ఆర్బీఐ హ్యాండ్‌బుక్‌ను చదువుకోవాలని, తలసరి ఆదాయంలో తెలంగాణ అగ్రభాగాన ఉండేలా చేసింది కేసీఆర్‌యేనని చెప్పారు. రుణమాఫీ 25 లక్షల మందికి కూడా పూర్తి కాలేదని, ఘట్కేసర్లో ప్రాథమిక సహకార సొసైటీలో ఒక రైతుకు కూడా రుణ మాఫీ కాలేదని స్పష్టంచేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను మీడియాకు చూపించారు. ముందు పీసీసీ అధ్యక్షుడు సీఎంతో మాట్లాడి మాఫీ అయ్యేట్టు చూడాలని, డమ్మీ పీసీసీ ప్రెసిడెంటా? అసలైన ప్రెసిడెంటా అనేది రుణమాఫీ చేయించి చూపించాలని చాలెంజ్ విసిరారు. ఆరు గ్యారెంటీల అమలు ఏమైందో పీసీసీ ప్రెసిడెంట్ చెప్పాలని, మహాలక్ష్మి పథకం కింద మహిళలకు నెలకు రూ. 2500 ఎప్పటి నుంచి ఇస్తారో చెప్పాలని డిమాంండ్ చేశారు. రేవంత్‌రెడ్డి సంకుచిత మనస్తత్వం గురించి మహేశ్‌గౌడ్ మాట్లాడాలని సూచించారు. సీఎం రేవంత్ తన శాడిస్టు ధోరణితోనే అల్లు అర్జున్ను అరెస్టు చేయించారని, చట్టం తన పని తాను చేస్తుందంటున్న సీఎం.. కొండారెడ్డిపల్లిలో చట్టం తన పని ఎందుకు చేయడం లేదని నిలదీశారు.
సీఎం రేవంత్‌రెడ్డి మెప్పు కోసమే పీసీసీ చీఫ్ కేసీఆర్‌కు లేఖ రాశారని మాజీ ఎమ్మెల్యే బాల సుమన్ విమర్శించారు. ఆయన లేఖ చిత్తు కాగితంతో సమానమని అన్నారు. వేరే పార్టీ నుంచి వచ్చి పార్టీని నాశనం చేస్తున్న రేవంత్ తీరును ప్రశ్నించాలని, కాంగ్రెస్‌ను బొంద పెట్టొద్దని కోరుతూ లేఖ రాయాలని సూచించారు. కేసీఆర్‌కు లేఖ రాస్తే రేవంత్‌రెడ్డి దగ్గర పరపతి పెరుగుతుందని మహేశ్‌గౌడ్ ఆశపడుతున్నారని తెలిపారు. కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో, డిక్లరేషన్లలో ఇచ్చిన హామీల అమలు ఎప్పుడో అని సీఎంకు లేఖ రాయాలని సూచించారు. అసెంబ్లీ, మండలి సమావేశాలు నెల రోజులు జరపాలని రేవంత్‌కు లేఖ రాయాలని మహేశ్‌గౌడ్‌కు సూచించారు. తెలంగాణ సమస్యలపై అసెంబ్లీ సమావేశాల్లో బీఆర్ఎస్ శాసన సభాపక్షం గట్టిగా పోరాడుతుందని చెప్పారు. తెలంగాణ సంస్కృతి గురించి అసలు రేవంత్, మహేశ్‌గౌడ్‌కు తెలుసా? తెలంగాణ తల్లి నుంచి బతుకమ్మను మాయం చేస్తారా? అని ప్రశ్నించారు. కేటీఆర్, హరీశ్‌రావు, కవిత ఉద్యమంలో పాల్గొన్నప్పుడు మహేశ్ ఎకడ ఉన్నారని నిలదీశారు.