దేశ రాజధాని అయిన ఢిల్లీలో కేంద్ర జల్‌శక్తి శాఖ ఆధ్వర్యంలో జరిగిన తెలంగాణ, ఏపీ రాష్ర్టాల ముఖ్యమంత్రుల సమావేశం జరిగింది. ఈ సమావేశంపై వెల్లువెత్తిన విమర్శలపై రేవంత్ రెడ్డి వివరణ ఇస్తూ…. ‘బనకచర్ల ప్రాజెక్టు అంశం చర్చకే రాలేదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బనకచర్ల ప్రాజెక్టును కడుతామని ఆ సమావేశంలో చెప్పనే లేదు. వాళ్లు ప్రాజెక్టు కడుతామన్న ప్రతిపాదనే చర్చకు రానప్పుడు, మనం ఆ ప్రాజెక్టును ఆపమని ఎలా అడుగుతాం’ అన్నారు. ఇదిలా ఉంటే, ‘తమది అపెక్స్ కౌన్సిల్ (అపెక్స్ కౌన్సిల్లోనూ ఉండేది కేంద్ర జలశక్తి శాఖ మంత్రి, రెండు రాష్ర్టాల ముఖ్యమంత్రులే) సమావేశం కాదని, జస్ట్ ఇన్ఫార్మల్ (అనధికారిక) భేటీ’ అని కూడా ఆయన చెప్పుకున్నారు. కానీ, ఈ సమావేశాన్ని ఏర్పాటుచేసింది మాత్రం కేంద్ర ప్రభుత్వమే అని మళ్లీ ఆయనే స్వయంగా తెలిపారు. సమావేశంలో గోదావరి, కృష్ణా నదుల మీద ప్రాజెక్టుల నిర్మాణం, నిర్వహణకు సంబంధించిన సమస్యలను గుర్తించి, చర్చించి, పరిష్కారం కోసం కమిటీ వేయాలన్న నిర్ణయం జరిగిందన్నారు.
ఇదే విషయమై అక్కడ అదే సమావేశం గురించి ఏపీ మంత్రి రామానాయుడు మాట్లాడుతూ… ‘బనకచర్ల ప్రాజెక్టుపైనే ప్రధానంగా చర్చ జరిగింది. తెలంగాణ ప్రభుత్వం లేవనెత్తిన సాంకేతిక అంశాలపై ఒక కమిటీని ఏర్పాటుచేయాలని నిర్ణయించాం. ఆగస్టులోగా ఆ కమిటీ ఏర్పాటు చేస్తాం. ఆ కమిటీలో రెండు రాష్ర్టాలు, కేంద్ర ప్రభుత్వానికి చెందిన సీనియర్ అధికారులు, సాంకేతిక నిపుణులుంటారు’ అని ఆంధ్రప్రదేశ్ మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. ఈ కమిటీ అన్ని సందేహాలను నివృత్తి చేసి, రెండు రాష్ర్టాలకు న్యాయం జరిగేలా ఒక సాంకేతిక/ పరిపాలనా రోడ్‌మ్యాప్‌ను రూపొందిస్తుందని కూడా ఆయన అన్నారు. క్లుప్తంగా చెప్పాలంటే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, తనకు మధ్య సమావేశంలో బనకచర్ల అంశం ప్రస్తావనకే రాలేదని రేవంత్ చెప్తే… బనకచర్లపై కమిటీ వేయాలని నిర్ణయం జరిగిందని ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి రామానాయుడు అన్నారు. ఒకే సమావేశం గురించి ఇద్దరు పరస్పర విరుద్ధమైన ప్రకటనలు చేయడంతో తెలంగాణ రాష్ట్ర ప్రజలు పలు ఆందోళనలకు గురవుతున్నారు. అయిత ఎవరేం మాట్లాడినా బనకచర్ల లోగుట్టు మాత్రం చంద్రబాబుకు మాత్రం కచ్చితంగా తెలిసే ఉంటుంది.
అయితే ఇటు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అటు ఏపీ మంత్రి రామానాయుడు ఇద్దరు చేసిన ప్రకటనల్లో ‘కమిటీ ఏర్పాటు చేయాలన్న నిర్ణయం జరిగింది’అనేది మాత్రం కామన్ అంశం. రెండు రాష్ర్టాల మధ్య ఉన్న జల వివాదాలపైనే ఆ కమిటీ అనేది ప్రాథమికంగా మనకు తెలుస్తున్నది. ప్రస్తుతం తెలంగాణ, ఏపీ మధ్య కొనసాగుతున్న జల వివాదం ఏమిటీ?, బనకచర్ల ప్రాజెక్టు ఎవరికి మేలు చేయనున్నది, ఎవరికి కీడు చేయనున్నది? మన సీఎం రేవంత్ ఏ వివాదంపై కమిటీ కోసం ఒప్పుకొన్నట్టు? కమిటీ ఏది చెప్తే అది వింటానని గంగిరెద్దులా ఎందుకు తలూపి వచ్చినట్టు? అనే విషయాలను ఈ వ్యాసంలో మనం కచ్చితంగా చర్చించుకోవాలి.
‘బనకచర్ల’ను కడతామని ఏపీ ప్రతిపాదించకపోవడం ఏమిటి? ఇటీవల జరుగుతున్న పరిణామాలను నిశితంగా పరిశీలించిన పిదప రాష్ట్రంలోని ఏ చిన్న పిల్లగాన్నడిగినా బల్లగుద్ది మరీ అందుకోసమేనని చెప్తాడు. బనకచర్ల ప్రాజెక్టు కోసమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రయత్నించింది. ఇందులో కేంద్ర ప్రభుత్వమూ ఒక అడుగు ముందుకువేసి ఏపీకి వత్తాసు పలికేందుకు సుముఖంగా ఉన్నదనేది గమనించాల్సిన విషయం. ఇది బాబు గారి బంటు అయిన రేవంత్‌కూ తెలుసు.
కానీ, డైవర్షన్ రాజకీయాలకు అలవాటుపడ్డ రేవంత్ రెడ్డి ప్రజలను పక్కదారి పట్టించేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నాడు. ఆయన చెప్పినట్టే ఆ సమావేశం ఎజెండాలో బనకచర్ల అంశం లేనే లేదనుకుందాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బనకచర్ల ప్రాజెక్టును ఏకపక్షంగా కట్టడానికి ప్రణాళికలు వేస్తున్న విషయం రేవంత్‌కు తెలువదా? ఆ ప్రాజెక్టు కట్టడానికి మేం అంగీకరించబోమని రేవంత్ రెడ్డి కరాకండిగా ఆ సమావేశంలో చెప్పాలి కదా, ఎందుకు చెప్పలేదు? చంద్రబాబు తమ గురువే కావచ్చు, కానీ, తెలంగాణకు ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసమైనా కేంద్రం వద్ద ఆ అంశాన్ని లేవనెత్తాలి కదా? కేంద్రం దగ్గర ప్రజల వాదనను ఎందుకు వినిపించలేదనేది కీలక ప్రశ్న..
నదుల సమస్యలపై అధికారులు, ఇంజినీర్లతో ఒక కమిటీ ఏర్పాటుచేసి, దానిలో చర్చించిన తర్వాత మిగతా అంశాలు ముఖ్యమంత్రుల స్థాయిలో మాట్లాడుకోవాలని నిర్ణయం తీసుకున్నామని రేవంత్ చెప్పారు. నీటి కేటాయింపులకు సంబంధించి గాని, కొత్తగా ప్రాజెక్టుల నిర్మాణం గాని, పాత ప్రాజెక్టుల అనుమతుల విషయాలు గాని, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల మీద అభ్యంతరాలు గాని.. వాటన్నిటిని గురించి ఈ సమావేశంలో చర్చకు వస్తాయన్నారు. గోదావరి, కృష్ణా నదులపై సమస్యలను చర్చించడానికి ఇప్పటికే గోదావరి, కృష్ణా బోర్డులు, పోలవరం అథారిటీ, సెంట్రల్ వాటర్ కమిషన్ ఉండగా కొత్తగా ఈ కమిటీ ఎందుకు అనేది రేవంత్‌కు, ఆయన గురువు బాబుకే తెలియాలి? తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల జలవివాదాలపై కేంద్ర సాధికార సంస్థలతో కూడిన సంస్థాగతమైన యంత్రాంగం ఉన్నది. అందుకోసం విభజన చట్టం సూచించిన అపెక్స్ కౌన్సిల్ కూడా ఉన్నది. ఇలాంటి చట్టబద్ధమైన వ్యవస్థలుండగా కొత్తగా ఈ కమిటీ చేసేదేముంటుంది? బనకచర్లకు సంబంధించి ఏపీ ప్రభుత్వం పంపించిన ఫీజిబిలిటీ నివేదికను కేంద్ర పర్యావరణ శాఖకు చెందిన నిపుణుల కమిటీయే కదా తిరస్కరించింది? ఈ కేంద్ర సాధికారిక సంస్థల కన్నా కూడా కమిటీకి ఎక్కువ విలువ ఉంటుందా? సాధికారిక సంస్థలే తిరస్కరించిన తర్వాత సమస్యలపై ఈ కొత్త కమిటీ ఎక్కడికి వెళ్తుందో అంతుచిక్కడం లేదు.
ఇదిలా ఉంటే… ఈ ముఖ్యమంత్రుల భేటీ ‘ఇన్ఫార్మల్ సమావేశం’ అని రేవంత్ కొత్త నిర్వచనం ఇచ్చారు. ఇన్ఫార్మల్ సమావేశమైతే కేంద్రం ఎందుకు ఈ సమావేశాన్ని ఏర్పాటుచేసింది. రెండు రాష్ర్టాల మధ్య వివాదాలు వచ్చినప్పుడే కదా కేంద్రం జోక్యం చేసుకునేది? ఇన్ఫార్మల్ అయితే, చంద్రబాబు తెలంగాణకు వచ్చో, రేవంత్ ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లో మాట్లాడుకోవచ్చు కదా? అలా ఎందుకు జరుగలేదు? కేంద్ర అధికారుల సమక్షంలో ఎందుకు మాట్లాడుకోవాల్సి వచ్చింది. ఇది కచ్చితంగా రేవంత్, చంద్రబాబు మధ్య జరిగిన సమావేశం కాదు, రెండు రాష్ర్టాల ముఖ్యమంత్రుల మధ్య జరిగిన సమావేశం. ఇక్కడ ఏదైనా అంగీకారం కుదిరితే భవిష్యత్తులో దాని ప్రభావం తప్పకుండా ఉంటుంది. ఇంతటి కీలకమైన భేటీని ‘జస్ట్ ఇన్ఫార్మల్’ అంటూ రేవంత్ కొట్టిపారేయడం మోసకారితనమే. రెండు రాష్ర్టాల ముఖ్యమంత్రుల మధ్య ఒక మీటింగ్ జరిగితే అది ‘ఇన్ఫార్మల్’ అయినా ‘ఫార్మల్’ అయినా దానికి, కచ్చితంగా మినిట్స్ రాయాల్సి ఉంటుంది. రేవంత్ ప్రకటన, రామానాయుడు ప్రకటనలు పరస్పరం భిన్నంగా ఉన్న నేపథ్యంలో గందరగోళాన్ని తెరదించడానికి కేంద్ర ప్రభుత్వం ఆ మినిట్స్‌ను వెంటనే బహిరంగపర్చాలి. లేకపోతే మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరోపించినట్టు తెలంగాణ ప్రయోజనాలకు విఘాతం తలపెట్టేలా గురువు చంద్రబాబు, శిష్యుడు రేవంత్ మధ్య కచ్చితంగా చీకటి ఒప్పందం జరిగిందనే చెప్పవచ్చు. కేంద్రమే వారికి మధ్యవర్తిగా వ్యవహరించిందని కూడా భావించాల్సి వస్తుంది.