కాసిపేట : కార్మికుల కోసం అదానీ, అంబానీలతో కాదు ప్రధానమంత్రి నరేంద్రమోదీతో కూడా మాట్లాడే సత్తా తమ కుటుంబానికి ఉందని బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ చెప్పారు. మంగళవారం సాయంత్రం మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం దేవాపూర్‌లో మంగళవారం రాత్రి లోకల్ ఓరియంట్ సిమెంటు ఎంప్లాయిమెంట్ వర్కర్స్ యూనియన్ గేట్ మీటింగ్ నిర్వహించారు. ముందుగా భారీ బైక్ ర్యాలీ తీశారు.
అనంతరం మీటింగ్‌లో ఎమ్మెల్యే గడ్డం వినోద్ మాట్లాడారు. పెద్దపులి గుర్తు పూస్కూరి విక్రమ్ రావుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ఎమ్మెల్యే కార్మికులను కోరారు. మా కుటుంబం 70 సంవత్సరాల నుంచి కార్మికులతో కలిసి పని చేస్తోందని చెప్పారు. తాను, తన తమ్ముడు వివేక్, ఎంపీ వంశీకృష్ణ ఎల్లప్పుడు కార్మికులకు అండగా ఉంటామన్నారు. కాకా కుటుంబం కార్మికుల కోసం కష్టపడే కుటుంబమని అన్నారు. ఫ్యాక్టరీలు పెట్టి 3,500 మంది కార్మికులకు ఉపాధి కల్పించామని చెప్పారు.
మనమందరం దేవాపూర్ ఓరియంట్ సిమెంట్ కంపెనీని కాపాడుకుందామని, 29న జరిగే యూనియన్ ఎన్నికల్లో విక్రమ్ రావును భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు ఏనుగు తిరుపతి రెడ్డి, అట్టెపల్లి శ్రీనివాస్, ఆడె జంగు, సోయం సూరు, భారతాని సతీష్, ఆత్మ చైర్మన్ రౌతు సత్తయ్య, మండల అధ్యక్షులు రత్నం ప్రదీప్, బింగి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.